అర శతాబ్దం తర్వాత.. ఆత్మీయ కలయిక | - | Sakshi
Sakshi News home page

అర శతాబ్దం తర్వాత.. ఆత్మీయ కలయిక

Jul 13 2026 12:46 AM | Updated on Jul 13 2026 12:46 AM

ఏయూ గోల్డెన్‌ జూబ్లీ బ్యాచ్‌ విద్యార్థుల సందడి

పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థుల ఆనందం

తరగతి గదులు, హాస్టళ్లలో మళ్లీ విద్యార్థుల్లా విహారం

వర్సిటీ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని ప్రకటన

విశాఖ విద్య: శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. 1976–78 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ‘గోల్డెన్‌ జూబ్లీ రీయూనియన్‌ ఫ్రెండ్స్‌’ పేరుతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి యూనివర్సిటీని సందర్శించి ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

ఒకే వేదికపైకి వివిధ రంగాల ప్రముఖులు

వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ మాజీ, ప్రస్తుత అధికారులు ఈ ఆత్మీయ కలయికలో సందడి చేశారు. ఇందులో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పూర్వ విద్యార్థులైన ఐఏఎస్‌ అధికారి పి.రమేష్‌ కుమార్‌, మేఘాలయ మాజీ డీజీపీ ఎం.విజయ్‌ కుమార్‌, ఏపీ ప్రభుత్వ మాజీ సెక్రటరీ శ్యాంబాబు, మాజీ ఐఏఎస్‌ ఆశయ్య, మాజీ ఆర్డీవో కామేశ్వరరావు, సెంట్రల్‌ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌, మాజీ ప్రిన్సిపల్‌, అధ్యాపకులు విజయ్‌ కుమార్‌, వెంకటేశ్వరరావు, ప్రశాంత్‌ కుమార్‌ ఉన్నారు. వీరితో పాటు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ పూర్వ విద్యార్థి సుందర్‌ బాబు, స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ పూర్వ విద్యార్థి సంతోష్‌ రావు, మ్యాథమెటిక్స్‌ విభాగం పూర్వ విద్యార్థి కోటేశ్వరరావు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జువాలజీ పూర్వ విద్యార్థులు విజయ్‌ కుమార్‌, జూపూడి ప్రసాద్‌, అశోక్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయో కెమిస్ట్రీ పూర్వ విద్యార్థులు ఎన్‌.రమేష్‌ కుమార్‌, శ్యాంసుందర్‌, ఫిలాసఫీ అండ్‌ రిలీజియన్‌ స్టడీస్‌ పూర్వ విద్యార్థి జాన్‌ క్రిస్టోఫర్‌ తదితరులు ఈ వేడుకలో పాలుపంచుకున్నారు.

హాస్టళ్లు, తరగతి గదుల్లో సందడి

కార్యక్రమంలో భాగంగా పూర్వ విద్యార్థులు మొదటగా తాము చదువుకున్న ఆర్ట్స్‌ కాలేజ్‌, సైన్స్‌ కాలేజ్‌ పరిసరాలతో పాటు నాగార్జున, శాతవాహన, సదరన్‌ హాస్టళ్లను సందర్శించారు. తాము విద్యార్థి దశలో ఉన్నప్పుడు నివసించిన గదులను వీక్షించి, ఆ జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం బాలయోగి పరిశోధకుల హాస్టల్‌ను సందర్శించారు. వెంటనే వారి వారి విభాగాలకు వెళ్లి తాము చదువుకున్న క్లాస్‌ రూమ్‌లను పరిశీలించారు. మనస్ఫూర్తిగా ఆనాటి బెంచీలలో కూర్చుని విద్యార్థి రోజులను గుర్తు చేసుకున్నారు. తమకు పాఠాలు బోధించిన నాటి గురువులను, స్నేహితులతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. వర్సిటీ అభివృద్ధికి తమ వంతు సాయం అందిస్తామని ప్రకటించారు.

ఒకప్పుడు చేతిలో పుస్తకాలు.. కళ్లలో భవిష్యత్‌ కలలతో అడుగుపెట్టిన అదే క్యాంపస్‌లో.. ఐదు దశాబ్దాల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. తరగతి గదుల్లో తమ స్థానాలను వెతుక్కుంటూ బెంచీలపై కూర్చున్నారు. ఒకప్పుడు తమకు నిలయమైన హాస్టల్‌ గదుల్లోకి వెళ్లి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కాలం వారిని మాజీ ఐఏఎస్‌లు.. మాజీ డీజీపీలు.. ఉన్నతాధికారులు.. ప్రొఫెసర్లు.. విద్యావేత్తలుగా మార్చినా.. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో అడుగుపెట్టగానే మళ్లీ విద్యార్థులుగానే మారిపోయారు. నవ్వులు, జ్ఞాపకాలు, ఆప్యాయ పలకరింపులతో ఆదివారం ఏయూ క్యాంపస్‌ భావోద్వేగ క్షణాలకు వేదికగా నిలిచింది. అర శతాబ్దం క్రితం విద్యార్థి జీవితాన్ని ఆరంభించిన అదే క్యాంపస్‌లో పూర్వ విద్యార్థుల కలయికతో శతాబ్ది ఉత్సవం చేసుకున్న ఏయూ మురిసిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement