యలమంచిలి రూరల్: రాంబిల్లి మండలం దిమిలి గ్రామానికి సమీపంలో శారదానది వద్ద ఆదివారం ట్రాక్టరు బోల్తా పడిన ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన సేనాపతి గోవింద(58) అనే రైతు మృతి చెందాడు.ఉదయం తన ట్రాక్టరుతో పొలం పనులకు వెళ్లిన గోవింద వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో శారదానది వద్ద సాంకేతిక లోపం తలెత్తడంతో ట్రాక్టరు అదుపుతప్పి సమీపంలో రోడ్డు పక్కకు దూసుకుపోయింది.ట్రాక్టరు నడుపుతున్న రైతుపై వాహనం పడడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.స్థానికులు చికిత్స కోసం యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రైతు మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రాంబిల్లి ఎస్‌ఐ నాగేంద్ర తెలిపారు. రోజూ నడిపే ట్రాక్టరే ఇంటి యజమాని ప్రాణాలు బలిగొనడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.


