తాటిచెట్లపాలెం(విశాఖ): విశాఖ బీచ్‌లో బీచ్ షాక్స్ పేరిట మద్యం అమ్మకాలను ప్రోత్సహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అఖిల భారత ప్రజా తంత్ర మహిళా సంఘం(ఐద్వా) తెలిపింది. ఐద్వా, వార్వా ఆధ్వర్యంలో ఆదివారం నరసింహనగర్ రైతుబజార్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి, ప్రజలకు కరపత్రాలు అందించి, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐద్వా, వార్వా నాయకులు మాట్లాడుతూ విశాఖ బీచ్ కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదని, వేలాది కుటుంబాలు, మహిళలు, పిల్లలు ప్రశాంతంగా గడిపే ప్రజా ప్రదేశమన్నారు. అలాంటి తీర ప్రాంతాన్ని మద్యం విక్రయ స్థావరంగా మార్చడం అద్యంత బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. ప్రజలు కోరుకునే అభివృద్ధి స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు, క్రీడా మైదానాలు, ఉపాధి అవకాశాలు, మహిళల భద్రత, గృహ వసతులు, కనీస వేతనాలు తప్ప.. మద్యం, మత్తుపదార్థాల వ్యాపారాన్ని ప్రోత్సహించడం కాదని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు సైతం మద్యం వినియోగాన్ని, విక్రయాలను ప్రోత్సహించే విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. విశాఖ ఎంపీ శ్రీభరత్ చేసిన.. ‘మద్యం తాగితే తప్పేంటి? ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే మద్యం తాగాలి’ అనే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 362ను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో మహిళా, విద్యార్థి, కార్మిక, ప్రజా సంఘాలను కలుపుకుని ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఆర్‌ఎన్ మాధవి, ఐద్వా నాయకులు వి.లక్ష్మి, లీలావతి, వార్వా జిల్లా అధ్యక్షుడు ఎన్.ప్రకాశరావు, నాయకుడు బి.లక్ష్మీపతి, పోర్ట్ యూనియన్ నాయకులు యూఎస్‌ఎన్ రాజు, పి.గౌరీష్, గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


