రెండు పుస్తకాల ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

రెండు పుస్తకాల ఆవిష్కరణ

Jul 13 2026 12:46 AM | Updated on Jul 13 2026 12:46 AM

సీతంపేట(విశాఖ): గురుశిష్యులు, కథా రచయితలు ద్విభాష్యం రాజేశ్వరరావు, జయంతి ప్రకాశ శర్మ రచించిన పుస్తకాలను ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. విశాఖ రసజ్ఞ వేదిక వ్యవస్థాపకుడు డాక్టర్‌ గండికోట రఘురామారావు అధ్యక్షతన ద్వారకానగర్‌ పౌర గ్రంథాలయంలో ఆదివారం సభ జరిగింది. రాజేశ్వరరావు రచించిన ‘పరిచయాలు పలకరింపులూను’ వ్యాస సంపుటిని సార్క్‌ సంస్థ వ్యవస్థాపకుడు, చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఆకుల చంద్రశేఖర్‌, ప్రకాశ శర్మ రచించిన ‘నాలుగో కోతి’ కథా సంపుటిని విద్యావేత్త డాక్టర్‌ డి.ఎన్‌.వి.రామశర్మ ఆవిష్కరించారు. రఘురామారావు మాట్లాడుతూ తెలుగు కథను సజీవంగా ఉంచేలా ద్విభాష్యం రాజేశ్వరరావు చేస్తున్న కృషిని కొనియాడారు. ఆయన ఇప్పటి వరకు 20 కథా సంపుటాలు, 15 నవలలు, 600కు పైగా కథలు, 1000కి పైగా వ్యాసాలు, 15 నాటికలు రాశారని తెలిపారు. రవళి అంతర్జాల మాసపత్రికలో వెలువడిన వ్యాసాలను పుస్తకంగా పాఠకులకు అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందన్నారు. జయంతి ప్రకాశ శర్మ రాసిన మూడో కథా సంపుటి నాలుగో కోతి అని, మూడు పుస్తకాలను విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. రచయితలిద్దరూ సహజ కవులని, ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకాలను భావితరాలకు అందించాలనే పుస్తక రూపంలోకి తీసుకొచ్చారన్నారు. సాహితీవేత్త డాక్టర్‌ డి.వి.సూర్యారావు, సీనియర్‌ జర్నలిస్ట్‌ జంధ్యాల శరత్‌బాబు పుస్తక సమీక్ష చేశారు. అనంతరం రచయిత బేతవోలు రామబ్రహ్మం ఆత్మీయ అతిథిగా ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement