● భక్తులతో కళకళలాడిన ఆలయాలు
● ప్రత్యేక పూజలు
సాక్షి,పాడేరు: శ్రీ పరాభవ నామ తెలుగు నూతన సంవత్సరాది ఉగాది వేడుకలను జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరులోని మోదకొండమ్మతల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మోదమ్మను దర్శించుకొని పూజలు చేశారు. పట్టణంలోని ఉమానీలకంఠేశ్వరస్వామి, కనకదుర్గమ్మ, గణపతి, అయ్యప్ప.సాయిబాబా ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అయ్యప్ప టెంపుల్ ప్లాజాలోని వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
గూడెంకొత్తవీధి: పూజారి పాకల్లో కొలువై ఉన్న బోడకొండమ్మ శాంభరీదేవి ఆలయంతోపాటు ఆర్వీనగర్‌లోని నూకాంబికా అమ్మవారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. అన్నసమారాధనలు చేశారు.
కొయ్యూరు: చీడిపాలెంలోని ఐటీడీఏ కాలనీలో టీటీడీ హిందూ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో పురోహితుడు శ్రీ రామచంద్రమూర్తి పంచాంగ శ్రవణం చేపట్టారు.
సీలేరు: సీలేరులో బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థులు పూజల్లో పాల్గొన్నారు. పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం నాగ శకుంతల ఉగాది పచ్చడిని విద్యార్థులకు పంచిపెట్టారు.
చింతపల్లి: పశువులబంద గ్రామంలో రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్నసమారాధన జరిగింది.


