సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులో రోడ్ల విస్తరణ పనులు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్లు లేకపోవడంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య జఠిలమవుతోంది. దీనివల్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది కాలంగా కలెక్టర్ దినేష్ కుమార్ స్వయంగా రోడ్ల వెడల్పుపై ప్రకటనలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో అడుగు ముందుకు పడకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి
పాత బస్టాండ్ నుంచి సినిమా హాల్ సెంటర్ మీదుగా తలారిసింగి వరకు, అలాగే పాత బస్టాండ్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా నక్కలపుట్టు రోడ్డు వరకు రోడ్డు విస్తరణ జరగకపోవడంతో వాహన చోదకులు నరకం చూస్తున్నారు. ముఖ్యంగా పాత బస్టాండ్ నుండి ఐటీడీఏ వరకు ట్రాఫిక్ సమస్య మరీ ఎక్కువగా ఉంది. కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారుల వాహనాలు సైతం ఈ ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నా, విస్తరణ పనుల ఊసే ఎత్తకపోవడం గమనార్హం.
మళ్లీ వెలిసిన ఆక్రమణలు
గత ఏడాది రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులు పాత బస్టాండ్ ప్రాంతంలో కొన్ని ఆక్రమణలను తొలగించారు. అయితే అధికారులు పర్యవేక్షణ వదిలేయడంతో మళ్లీ అదే స్థానాల్లో దుకాణాలు వెలిశాయి. దుకాణాల ముందే వాహనాలను రోడ్డుపై నిలిపివేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా శుక్రవారం వారపు సంత రోజున, పండుగ సమయాల్లో సాయిబాబా గుడి వరకు ఉన్న రోడ్డు పూర్తిగా స్తంభించిపోతోంది.
యంత్రాంగంలో కదలని చలనం
దినదినాభివృద్ధి చెందుతున్న పాడేరులో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజుతో పాటు పలు ఆదివాసీ సంఘాలు పలుసార్లు శాంతియుత ఆందోళనలు చేపట్టాయి. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలో చలనం లేకపోవడంపై గిరిజనులు మండిపడుతున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా ఈ ప్రధాన రహదారిలోనే ఉండటంతో పర్యాటకులు, స్థానికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో వేచి చూడాల్సి వస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లా కేంద్రం పాడేరులో నిత్యం అవస్థలు
అడుగుపడని విస్తరణ
ప్రకటనలకే పరిమితమైన రోడ్ల అభివృద్ధి
శాంతియుత ప్రదర్శనలు చేసినా
పట్టని వైనం
అధికారుల తీరుపై స్థానికుల అసహనం
నిత్యం ఇబ్బందులు
జిల్లా కేంద్రమైన పాడేరులో ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పాతబస్టాండ్ నుంచి సినిమాహాల్ సెంటర్ మధ్య సమస్య తీవ్రంగా ఉంది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపివేస్తున్నారు. రోడ్డు మీదే దుకాణాల వల్ల అవస్థలు తప్పడం లేదు.
– కూడా రాధాకృష్ణ, జిల్లా ప్రతినిధి,
గిరిజన సమాఖ్య, పాడేరు
రోడ్లు విస్తరించాలి
మైదాన ప్రాంతాల్లోని పట్టణాల్లో రోడ్లు విస్తరణతో పాటు డ్రైనేజీ, పుట్‌పాత్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్న పాలకులు గిరిజన ప్రాంతాలను మాత్రం విస్మరిస్తున్నారు.జిల్లా కేంద్రం పాడేరులోని అన్ని రోడ్లను వెంటనే విస్తరించాలి.రోడ్లు వెడల్పు జరిగితే అన్ని వర్గాల ప్రజలకు మేలు.
– రామారావుదొర, జిల్లా అధ్యక్షుడు,
ఆదివాసీ జేఏసీ, పాడేరు
రోడ్డు విస్తరణే లక్ష్యం
పాడేరు పట్టణంలో రోడ్డు విస్తరణ లక్ష్యంతో ఉన్నాం. పాతబస్టాండ్ వరకు జాతీయ రహదారిలో ఉండగా,అక్కడ నుంచి సినిమాహాల్ సెంటర్,తలారిసింగి రోడ్డు వరకు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డు ఆనుకుని ఉన్న దుకాణాల తొలగింపునకు చర్యలు తీసుకుంటాం.
– ఏఎస్ దినేష్‌కుమార్, కలెక్టర్, పాడేరు


