● బాధ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
● గిరిజన సంఘం డిమాండ్
చింతపల్లి: లంబసింగి జంక్షన్ (కొర్రుబయలు)లో ఆదిమ జాతి గిరిజనులపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడిన గిరిజనేతరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనుంజయ్ డిమాండ్ చేశారు. బుధవారం డీఎల్వో సంఘ ప్రతినిధులతో కలిసి ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు.
వివాదానికి కారణం
లంబసింగి పంచాయతీ పరిధిలోని జలగలగెడ్డ గ్రామానికి సంబంధించి రోడ్డు నిర్మాణ విషయంలో తలెత్తిన చిన్న వివాదాన్ని, కొర్రుబయలులో వ్యాపారం చేసుకుంటున్న కొందరు గిరిజనేతరులు స్వార్థంతో పెద్దది చేస్తున్నారని ఆయన ఆరోపించారు.గిరిజనుల మధ్య విభేదాలు సృష్టిస్తూ, రాజకీయ పెత్తనంతో గిరిజన హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనేతరుల స్వార్థం కారణంగానే కొర్రుబయలు జంక్షన్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.
బాధితులకు న్యాయం చేయాలి
ఈ వివాదంలో జలగలగెడ్డకు చెందిన ఆదివాసీ గిరిజనులపై ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడ్డారని ధనుంజయ్ ఆరోపించారు. ఈ ఘటనపై ఏఎస్పీ స్పందించి సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులైన గిరిజనేతరులపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి ఆదివాసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో డీఎల్వో రాష్ట్ర కార్యదర్శి కె. వెంకయమ్మ, కాసులమ్మ, గిరిజన సంఘం మండల కార్యదర్శి సాగిన చిరంజీవి పాల్గొన్నారు. వీరితో పాటు బాధిత కుటుంబ సభ్యులు వీరన్న, కామేశ్వరరావు, సీతమ్మ తదితరులు హాజరయ్యారు.


