గూడెంకొత్తవీధి: మండలంలోని డొకులూరు గ్రామంలో లేటరైట్ తవ్వకాలకు సంబంధించి బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ హాజరయ్యారు. అధికారులు ముందస్తుగా సమాచారం అందించడంతో పెద్ద ఎత్తున గిరిజనులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ సభకు తరలివచ్చారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. డొకులూరులో లేటరైట్ ఖనిజ తవ్వకాలపై గిరిజనుల అభిప్రాయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది తుది అనుమతుల కోసం నిర్వహించిన సభ కాదని, కేవలం గిరిజనుల ఇష్టాయిష్టాలు, వారి సమస్యలు, వారి అభిప్రాయాలను తెలుసుకోవడం కోసమేనని స్పష్టం చేశారు. గిరిజనుల ఆమోదం, అభీష్టం మేరకే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇక్కడ వెల్లడైన సూచనలు, నిరసనలను ప్రభుత్వానికి నివేదిస్తామని, గిరిజనులు ఎలాంటి అపోహలు పడాల్సిన అవసరం లేదని, వారికి అన్యాయం జరిగే పనులను ప్రభుత్వం చేపట్టదని భరోసా ఇచ్చారు.
భిన్నాభిప్రాయాలు.. మిశ్రమ స్పందన
డొకులూరులోని సర్వే నంబర్ వన్‌లో సుమారు 11.370 హెక్టార్ల పరిధిలో లేటరైట్ తవ్వకాల కోసం పాడేరుకు చెందిన రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. ఈ తవ్వకాలపై స్థానిక గిరిజనుల నుండి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. భూములు ఉన్న కొందరు గిరిజనులు తవ్వకాలకు మద్దతు తెలిపారు.మరికొందరు తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. గిరిజన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు మైనింగ్‌ను పూర్తిగా ఖండించారు. మైనింగ్ వల్ల భవిష్యత్తులో పర్యావరణ సమస్యలు, నీటి ఎద్దడి తలెత్తుతాయని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, పాడేరు మైనింగ్ ఏడీ కృష్ణారావు, తహసీల్దారు అన్నాజీరావు పాల్గొన్నారు. గిరిజన సంఘాల తరఫున పెదవలస సర్పంచ్ కృష్ణవంశీ, జై భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజుబాబు, సీపీఎం, సీపీఐ నాయకులు హాజరయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ సుధాకర్, ఎస్‌ఐ సురేష్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ
లేటరైట్ తవ్వకాలపై డొకులూరులో
అభిప్రాయ సేకరణ
హాజరైన గిరిజనులు, గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు


