● అభిమాన నీరాజనంమురిసిన మన్యం..
అడ్డాకులతో తయారుచేసిన టోపీని ధరిస్తున్న జగనన్న
సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ పర్యటనకు విచ్చేసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బుధవారం పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. జననేత రాకతో విశాఖపట్నం, అల్లూరి జిల్లాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. మాజీ సీఎం వస్తున్నారని తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు ఉదయం 10 గంటలకే విశాఖ విమానాశ్రయానికి చేరుకుని ఎదురుచూశారు. అరకు పర్యటన ముగించుకుని తిరిగి వచ్చే వరకు అక్కడే వేచిచూశారు. అరకులోయలో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి వచ్చిన జగన్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు విమానాశ్రయం నుంచి మర్రిపాలెం వరకు రోడ్లపై నిలబడ్డారు. ఆయనను చూడగానే ‘జై జగన్’ నినాదాలతో మార్మోగింది. ఓ దశలో అభిమానులు బారికేడ్లు దాటి దగ్గరగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు నియంత్రించారు. విమానాశ్రయం నుంచి కాన్వాయ్‌గా బయలుదేరిన జగన్‌కు మర్రిపాలెంలోని రాణాప్రతాప్‌నగర్ వరకు రోడ్డుదారిన ఇరువైపులా నిలబడి అభిమానులు పూలవర్షం కురిపించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆత్మీయ స్వాగతం పలికారు. రాణాప్రతాప్‌నగర్‌లోని వైఎస్సార్‌సీపీ విశాఖ దక్షిణ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ నివాసానికి చేరుకున్న సందర్భంగా అక్కడ కూడా పెద్దఎత్తున జనసమ్మర్ధం కనిపించింది.
ఘనస్వాగతం పలికిన పార్టీ నేతలు
అరకులోయ, విశాఖలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడు, ఎంపీలు గొల్ల బాబూరావు, గుమ్మా తనూజరాణి, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, మత్స్సరాస విశ్వేశ్వరరాజు, బొడ్డేడ ప్రసాద్, మజ్జి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, కంబాల జోగులు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, కె.భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, తైనాల విజయ్‌కుమార్, చింతలపూడి వెంకట్రామయ్య, శోభా హైమావతి, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, దేవన్‌రెడ్డి, మలసాల భరత్‌కుమార్, మాజీ ఎంపీలు భీశెట్టి సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, ముఖ్యనేతలు కోలా గురువులు, చింతకాయల సన్యాసిపాత్రుడు, చిక్కాల రామారావు, ఏడువాక సత్యరావు, బాణాల శ్రీనివాసరావు కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు.
మన్యం మురిసింది.. సాగరం పులకించింది. జనతరంగం ఎగసింది.. సంక్షేమ ప్రదాతకు ఆత్మీయ స్వాగతం పలికింది.. అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది.. ‘సీఎం.. సీఎం.. జై జగన్’ నినాదాలతో హోరెత్తించింది. అడుగడుగునా పూలవర్షాలు, జనహారతులు, అభిమానుల కేరింతల మధ్య వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లాల పర్యటన జనప్రభంజనాన్ని తలపించింది. అరకు, విశాఖ నగరంలో వెల్లువలా తరలివచ్చిన జనకెరటం అభిమాన నేతను చూసి మురిసిపోయింది. వివాహ వేడుకలే జనవేదికలుగా మారి.. జననేతకు నీరాజనాలు అర్పించిన దృశ్యాలు ఉమ్మడి విశాఖ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి.
జననేత జగన్ రాకతో హోరెత్తిన ఉమ్మడి విశాఖ
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహం,
మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ కుమారుడి రిసెప్షన్‌కు హాజరు
అధినేత రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం
పర్యటన సాగిందిలా..
ఉదయం 9.45 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 11.20 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం హెలికాప్టర్‌లో అరకులోయ హెలిప్యాడ్‌కు చేరుకుని, తంగులుగూడ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయంలో నిర్వహించిన అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడు రేగం చాణక్య–అశ్విని వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. అక్కడి నుంచి తిరిగి హెలికాప్టర్‌లో విశాఖ విమానాశ్రయానికి మధ్యాహ్నం 1.20 గంటలకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన మర్రిపాలెం రాణాప్రతాప్‌నగర్‌లోని వాసుపల్లి గణేష్‌కుమార్ నివాసానికి చేరుకుని, ఆయన కుమారుడు గోవింద్ సాకేత్–శ్రావణి వివాహ రిసెప్షన్‌లో పాల్గొని ఆశీస్సులు అందించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, 2.40 గంటలకు విమానంలో ప్రయాణమయ్యారు.


