దేవరాపల్లి: ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించకపోవడంతో ఏటా జీడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి. దొర ఆవేదన వ్యక్తం చేశారు. జీడి పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మండలంలోని చింతలపూడి సచివాలయం వద్ద గిరిజన రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. అనంతరం సచివాలయ అధికారులకు డిమాండ్ల కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకన్న, దొర మాట్లాడుతూ వరి, చెరకు, పత్తి, పామాయిల్ మాదిరిగా జీడి పంటకు మద్దతు ధర ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. జీడికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేజీకి రూ. 200 చొప్పున మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. స్థిరంగా ధర లేక పోవడంతో దళారుల చేతుల్లో మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి సైతం రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ధ్వజమెత్తారు. జీడి పంట విస్తరణకు ప్రత్యేక దృష్టి సారించి ఇతర దేశాల నుంచి జీడి దిగుమతులను నిలుపుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎం. ఎర్రునాయుడు, జె. ఈశ్వరరావు, దాయిరి ఈశ్వరరావు, గమ్మెల శ్రీను, చిన్నారావు, సావు రాము, పోయిరి రాము, ఇరట ఈశ్వరరావు, పాంగి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.


