ఇంజరి పంచాయతీలో మూగజీవాల మృత్యువాత | - | Sakshi
Sakshi News home page

ఇంజరి పంచాయతీలో మూగజీవాల మృత్యువాత

Mar 3 2026 8:04 AM | Updated on Mar 3 2026 8:04 AM

ముక్కు నుంచి నీరు, నోటి నుంచి నురగ కారుస్తూ మృతి

ఏడాది నుంచి జాడలేని పశువైద్య సిబ్బంది

36 గ్రామాల్లో పశువులు,గొర్రెలు, మేక లకు అందని టీకాలు

పశువైద్య శిబిరం నిర్వహించాలని రైతుల వినతి

పెదబయలు: పాడి పశువుల సంరక్షణకు రూ.కోట్ల ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గిరిజన గ్రామాల్లో పాడి పశువులకు వైద్యం,వ్యాధి నిరోధక టీకాలు అందని ద్రాక్షగానే మిగిలాయి. సకాలంలో వైద్యం అందక రెండు వారాల వ్యవధిలో ఆరు గ్రామాల్లో 60కి పైబడి పశువులు మృత్యువాత పడ్డాయి. మండలంలోని మారుమూల ఇంజరి పంచాయతీలోని తల్లాబు,గిండెలి,సరియవీధి, మూలలోవ,కన్సులమెట్ట,భూసులగుమ్మి గ్రామాల్లో ముక్కు నుంచి నీరు, నోటి నుంచి నురగ కారుస్తూ 60 మూగజీవాలు మరణించాయి. తల్లాబులో 30 పశువులు, మిగిలిన గ్రామాల్లో మరో 30 పశువులు మృతి చెందినట్టు రైతులు తెలిపారు. గ్రామ సమీపంలో పశువులు ఎక్కడిపడితే అక్కడ చనిపోతుండడంతో మట్టిలో పూడ్చడానికి ఆయా గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు.

కన్నెత్తి చూడని పశువైద్య సిబ్బంది

ఇంజరి పంచాయతీలోని ఆరు గ్రామాల్లో ఏడాది కాలంగా పశువులు, గొర్రెలు, మేకలకు ఎలాంటి వ్యాఽధి నిరోధక టీకాలు,నట్టల నివారణ మందు అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువైద్య సిబ్బంది తమ గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదని వాపోయారు. ప్రభుత్వం,సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల్లో పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలందించాలని వారు కోరుతున్నారు.

నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి

రెండు వారాల వ్యవధిలో 60 పశువులు మృత్యువాత పడి, తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు తెలిపారు. పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని వారు కోరారు. ఈ విషయంపై ఇంజరి వెటర్నరీ అసిస్టెంట్‌ బుచ్చిరాజును వివరణ కోరగా గత ఆగస్టులో ఇంజరికి పంచాయతీకి బదిలీపై వచ్చానని, పంచాయతీలో 43 గ్రామాలకు గాను ఏడు గ్రామాల్లో పశువులు,గొర్రెలు,మేకలకు వ్యాధి నిరోధక టీకాలు వేశామని, మిగిలిన గ్రామాల్లో టీకాలు వేయలేదని చెప్పారు. పెన్షన్‌ పంపిణీ తదితర పనుల వత్తిడి కారణంగా మిగతా గ్రామాల్లో టీకాలు వేయలేకపోయినట్టు తెలిపారు. స్థానిక పశుసంవర్థక శాఖ ఏడీ కిశోర్‌ వద్ద ప్రస్తావించగా మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో అన్ని గ్రామాల్లో పశువులకు వ్యాక్సిన్‌ వేసినట్టు చెప్పారు. పశువైద్యంపై అధికారులు పొంతన లేని విధంగా చెప్పడం ఇక్కడ పరిస్థితికి అద్దంపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement