డార్క్ కామెడీతో ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’
డాబాగార్డెన్స్ (విశాఖ): శివాజీ, లయ జంటగా నటించిన నూతన చిత్రం ‘సంప్రదాయని సుద్దిని సుద్దపూసని’ ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఆదివారం నగరంలో జరిగిన ప్రెస్ మీట్‌లో చిత్ర విశేషాలను యూనిట్ పంచుకుంది. ఈ సందర్భంగా హీరో శివాజీ మాట్లాడుతూ.. ‘ఇది అద్భుతమైన డార్క్ కామెడీ చిత్రం. మా హిట్ పెయిర్ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుంది. సినిమా ఆఖరి 45 నిమిషాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. రోహన్ అద్భుతంగా నటించాడు. కుటుంబం కోసం సినిమాలు చేస్తూనే, ప్రజల కోసం పోరాడుతాను. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలి. మహిళల వస్త్రధారణపై గతంలో నేను చేసిన వ్యాఖ్యలు కేవలం నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే.’అని తెలిపారు. హీరోయిన్ లయ మాట్లాడుతూ.. ‘మా తాతగారి ఊరు విశాఖ కావడంతో ఇక్కడితో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఇందులో నా పాత్ర పేరు ఉత్తర. భర్తపై చూపించే అతిప్రేమ తెచ్చిపెట్టే చిక్కుల చుట్టూ ఈ కథ వినోదాత్మకంగా సాగుతుంది. అన్ని వర్గాల వారు ఎంజాయ్ చేసే చిత్రమిది.’అని తెలిపారు.


