ఇంటి పన్నుల వసూలుకు ప్రత్యేక చర్యలు
చింతపల్లి: మండల కేంద్రంలో దీర్ఘకాలంగా బకాయి ఉన్న ఇంటి పన్నుల వసూలు కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి కె. చంద్రశేఖర్ తెలిపారు. శనివారం ఆయన చింతపల్లిలోని గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్‌ను కలిసి, పన్ను చెల్లింపునకు సంబంధించిన నోటీసులను అందజేశారు. మేజర్ పంచాయతీ పరిధిలోని గృహ వినియోగదారులతో పాటు, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు కూడా భారీగా పన్ను బకాయిలు పడ్డాయని ఆయన పేర్కొన్నారు.ఈ బకాయిలను త్వరితగతిన వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పన్నుల రూపంలో వచ్చే ఆదాయంతోనే పంచాయతీ పరిధిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల అధికారులు తమ పరిధిలోని బకాయిలను వెంటనే చెల్లించి, పంచాయతీ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.


