వైద్య కళాశాల పనులు వేగవంతం చేయాలి
సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రమైన పాడేరులోని వైద్య కళాశాల, ఆస్పత్రి భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన వైద్య కళాశాల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడేరు వైద్య కళాశాల నిర్మాణం గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు. సుమారు రూ.500 కోట్లతో, 35 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ నిర్మాణ పనులు ఇప్పటికీ 70 శాతం మాత్రమే పూర్తి కావడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. పనులు నత్తనడకన సాగడం వల్ల అటు రోగులు, ఇటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ముఖ్యంగా హాస్టళ్లు, ఆస్పత్రి భవనాలు అసంపూర్తిగా ఉండటం బాధాకరమన్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి ఎన్‌ఎంసీ 100 సీట్లు పెంచుతున్నట్లు ప్రకటించినప్పటికీ, మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఆ నిర్ణయం కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెండింగ్‌లో ఉన్న నిర్మాణ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. యుద్ధప్రతిపాదికన పనులు పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరం నాటికి 150 సీట్లతో కళాశాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు లోకనాథం, సురేంద్ర, అప్పలనరస, రామారావు, బాలదేవ్, వరహాలబాబు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
వి. శ్రీనివాసరావు డిమాండ్


