గరిమండలో పోలీసులకార్డెన్ సెర్చ్
కొయ్యూరు: మండలంలోని బూదరాళ్ల పంచాయతీ గరిమండ గ్రామంలో శుక్రవారం రాత్రి పోలీసులు చుట్టుముట్టి తనిఖీలు (కార్డెన్ సెర్చ్ ) నిర్వహించారు. ఒకప్పుడు ఈ గ్రామం గంజాయి సాగుకు, అమ్మకాలకు ప్రధాన కేంద్రంగా ఉండేది. వ్యాపారులు సైతం ఇక్కడి నుంచే గంజాయిని కొనుగోలు చేసేవారు. ఈ నేపథ్యంలో, గంజాయి ప్రభావిత గ్రామాల జాబితాలో గరిమండ ఉండటంతో.. సీఐ బి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంప ఎస్‌ఐ సీదరి శ్రీనివాస్, ఏపీఎస్‌పీ పోలీసులు కలిసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు.గంజాయి నిల్వలు ఉండవచ్చన్న అనుమానంతో గ్రామంలోని ప్రతి ఇల్లు సోదా చేశారు. సరైన పత్రాలు లేని నాలుగు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఇంట్లోని కుటుంబ సభ్యుల వివరాలను సేకరించడంతో పాటు, గ్రామానికి సంబంధం లేని వ్యక్తుల వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ విలేకరులతో మాట్లాడుతూ.. గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి తరలించేందుకు వచ్చే వ్యక్తులకు ఆశ్రయం కల్పించినా వారిని నేరస్తులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. గ్రామంపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, గిరిజనులు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు.


