కదంతొక్కిన ఆదివాసీలు
● పీఎం జన్‌మన్ ఇళ్ల నిర్మాణ బిల్లులు చెల్లించాలని పాడేరులో భారీ నిరసన
పాడేరు ఐటీడీఏ ఎదుట ధర్నా చేస్తున్న సీపీఎం,గిరిజన సంఘ నేతలు, ఆదివాసీలు
హౌసింగ్ పీడీకి వినతిపత్రం ఇస్తున్న శ్రీనివాసరావు తదితరులు
సాక్షి, పాడేరు: జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పీఎం జన్‌మన్ పథకం ఇళ్ల నిర్మాణ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు కదం తొక్కారు. గిరిజన సంఘం, సీపీఎం నేతల ఆధ్వర్యంలో శుక్రవారం పాడేరు పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై ఆదివాసీలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మోదకొండమ్మ తల్లి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ ప్రధాన వీధుల గుండా ఐటీడీఏ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం ఐటీడీఏ ఎదుట చేపట్టిన మహా ధర్నా ఉధృతంగా సాగింది.కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ప్రకటించిన రూ. లక్షను వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. జన్‌మన్ 2.0 పథకం రెండో విడతలో అర్హులైన ఆదివాసీలందరికీ కొత్త ఇళ్లను మంజూరు చేయాలని కోరారు.
ఆందోళన ఉధృతం చేస్తాం
తమ బిల్లుల సమస్యను వెంటనే పరిష్కరించని పక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. అనంతరం హౌసింగ్ పీడీ బాబు నాయక్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు కె. లోకనాథం, పి. అప్పలనరసయ్య, సాగిన ధర్మన్న పడాల్, కిల్లో సురేంద్ర, బాలదేవ్, పాలికి లక్కు పాల్గొన్నారు.
కదంతొక్కిన ఆదివాసీలు


