చింతపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ అప్పలస్వామి
చింతపల్లి: గిరిజన రైతులు సుగంధ ద్రవ్య పంటలను కేవలం వాణిజ్య సరళిలో కాకుండా శాసీ్త్రయ పద్ధతుల్లో సాగు చేయాలని, అప్పుడే అధిక దిగుబడులతో పాటు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి అన్నారు. గురువారం స్థానిక పరిశోధనా స్థానంలో స్పైసెస్ బోర్డు 39వ వార్షికోత్సవం సందర్భంగా సీనియర్ ఫీల్డ్ అధికారిణి బొడ్డు కళ్యాణి అధ్యక్షతన గిరిజన రైతులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ అప్పలస్వామి మాట్లాడుతూ.. మన్యంలోని పర్వత శ్రేణులు, ఇక్కడి వాతావరణం మిరియాలు, అల్లం, పసుపు వంటి సుగంధ ద్రవ్య పంటల సాగుకు ఎంతో అనుకూలమన్నారు.
రైతులు పండించిన ఉత్పత్తులను నేరుగా అమ్మకుండా యంత్రాల ద్వారా గ్రేడింగ్, పాలిషింగ్ చేయడం వల్ల మార్కెట్‌లో మంచి ధర వస్తుందని సూచించారు. స్పైస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ అధికారిణి కల్యాణి మాట్లాడుతూ గిరిజన రైతులకు 75 శాతం, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు 90 శాతం రాయితీపై యంత్రాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మిరియాలు, పసుపు, అల్లం కోసం బ్రాయిలర్, గ్రేడింగ్, పాలిషింగ్, డ్రైయింగ్, కటింగ్ యంత్రాలు, చింతపండు పొట్టు తీసేందుకు, పిక్కలు వేరు చేసేందుకు ప్రత్యేక యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇవన్నీ విద్యుత్ సౌకర్యంతో పనిచేస్తాయని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం మేడూరు గ్రామానికి చెందిన రైతు కె. లక్ష్మణరావుకు చింతపండు ప్రాసెసింగ్ యంత్రాన్ని పంపిణీ చేశారు. శాస్త్రవేత్త సందీప్ నాయక్, అధిక సంఖ్యలో గిరిజన రైతులు పాల్గొన్నారు.


