సంతసం
పండగ
సాక్షి, పాడేరు: సంక్రాంతి పండగ వేళ మన్యం ప్రాంతంలోని వారపు సంతలు గిరిజనులతో కళకళలాడుతున్నాయి. జిల్లాలోనే అతిపెద్దవైన పాడేరు సంత శుక్రవారం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే గిరిజనులు తమ వ్యవసాయ ఉత్పత్తులైన కాఫీ, రాజ్‌మా గింజలను విక్రయించి, ఆ ఆదాయంతో పండగ కొనుగోళ్లు చేపట్టారు.
● పాత బస్టాండ్, మెయిన్ రోడ్డులోని సినిమాహాల్ సెంటర్ దుకాణాల్లో కొత్త దుస్తుల కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఒక్క వస్త్ర విభాగానికే సుమారు రూ. 60 లక్షల వ్యాపారం జరిగినట్లు అంచనా.
● గత రెండు వారాలుగా వెలవెలబోయిన సంత, పండగ రాకతో ఒక్కసారిగా రద్దీగా మారింది. నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలు కూడా ఆశాజనకమైన లాభాలను గడించాయి.
అరకు సంతలో భారీగా వ్యాపారం
డుంబ్రిగుడ: సరిహద్దు రాష్ట్రం ఒడిశా ప్రజలకు కూడా కీలకమైన అరకు వారపు సంతలో సంక్రాంతి శోభ ఉట్టిపడింది. గిరిజనుల ’సూపర్ మార్కెట్’గా పిలిచే ఈ సంతలో పండగ సందర్భంగా సుమారు రూ. 2 కోట్ల వ్యాపారం జరిగింది. సాధారణంగా రూ. 1.50 కోట్లు జరిగే టర్నోవర్, పండగ వేళ మరో రూ. 50 లక్షలు పెరగడం విశేషం.
● అల్లం, పసుపు, మిరియాలు, కాఫీ గింజల విక్రయాల ద్వారా గిరిజన కుటుంబాలకు మంచి ఆదాయం లభించింది.
● మేకలకు గిరాకీ ఏర్పడింది. సంతలో ఒక్కో మేక ధర రూ. 8వేల నుంచి రూ. 12 వేలు పలికింది.
● పండగ వేడుకలకు వినియోగించే తుడుం రూ. 2,500 నుంచి రూ.3వేలు, డప్పు రూ. 1500 నుంచి రూ.2వేలు, కిరిడి రూ.700 నుంచి రూ.వెయ్యి చొప్పున ధరలు పలికాయి. కుండ పెద్దది రూ. 220 నుంచి రూ.350, చిన్నవి వాటి పరిమాణం బట్టి ధరలు లభించాయని గిరిజనులు తెలిపారు.
● పండగ సందర్భంగా గిరిజనులు ’సేర్‌బుడియా’ విచిత్ర వేషధారణలతో చందాలు సేకరిస్తూ సందడి చేశారు. మట్టి కుండలు, గాజులు, చెప్పుల దుకాణాల వద్ద గిరిజన మహిళలు బారులు తీరారు.
పాడేరు సంతలో రూ.60 లక్షల వస్త్ర వ్యాపారం
అరకులో రూ.కోట్ల మేర టర్నోవర్
కాఫీ, రాజ్‌మా అమ్మకాలతో గిరిజన రైతులకు పండగ ఆదాయం
మేకలు పెరిగిన గిరాకీ
ఆకట్టుకున్న సేర్‌బుడియాల వేషధారణలు
భారీగా సంప్రదాయ వాయిద్య పరికరాల కొనుగోళ్లు
సంతసం
సంతసం


