ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులా?
చంద్రబాబు సర్కారు చర్యలు అత్యంత దుర్మార్గం
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వరప్రసాద్, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చాణక్య ధ్వజం
పాడేరు: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలపై ప్రశ్నిస్తున్న గొంతులను అక్రమ కేసులు బనాయించి నొక్కేయాలని చూడటం అత్యంత దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు లోచలి వరప్రసాద్, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల నాయకులతో పాటు ఇతర ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ తదితర విద్యార్ధి సంఘాల నాయకులు శాంతియుత పోరాటం చేస్తున్నారన్నారు. అయినా కూటమి ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా ప్రశ్నించి, పోరాటం చేసే వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం ఎంత వరకు సమంజసమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు చేయకుండా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యాలయాల్లో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతుందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై తాము నిత్యం పోరాటాలు చేస్తూనే ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగభూషణం, అరకు నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బత్తిరి చరణ్‌తేజ, అరకు నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్‌చార్జి పాంగి విజయ్, చింతపల్లి మండలం సోషల్ మీడియా అధ్యక్షుడు పసుపులేటి వీరన్నపడాల్ పాల్గొన్నారు.


