రాలిపోతున్న పసిమొగ్గలు | - | Sakshi
Sakshi News home page

రాలిపోతున్న పసిమొగ్గలు

Jan 11 2026 7:32 AM | Updated on Jan 11 2026 7:32 AM

రాలిప

రాలిపోతున్న పసిమొగ్గలు

గిరిజన విద్యాలయాల్లో‘ఆరోగ్యం’ కరువు గాలిలో దీపంలా ప్రాణాలు 18 నెలల్లో ఏడుగురు విద్యార్థుల బలి రక్తహీనత సమస్యే అధికం హామీకే పరిమితమైనహెల్త్‌ వలంటీర్ల నియామకం పట్టించుకోని చంద్రబాబు సర్కారు 61,306 మంది విద్యార్థులకు వైద్యపరంగా భరోసా కరువు

గిరిజన విద్యార్థుల జీవితాలు అంధకారంలో కూరుకుపోతున్నాయి. చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన చిన్నారులు, ఆశ్రమ పాఠశాలల్లో సరైన వైద్యం అందక కన్నుమూస్తున్నారు. గత 18 నెలల కాలంలోనే ఏడుగురు విద్యార్థులు అనారోగ్యంతో మృతి చెందడం ఏజెన్సీలో తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా రక్తహీనత మహమ్మారిలా మారి వారి ప్రాణాలను బలి తీసుకుంటోంది. ప్రభుత్వం ఇచ్చిన ’హెల్త్‌ వలంటీర్ల’ నియామక హామీ కాగితాలకే పరిమితం కావడంతో, సుమారు 61 వేల మంది విద్యార్థుల ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి గిరిజన గూడాల్లో విషాద ఛాయలు నింపుతున్నాయి.

సాక్షి, పాడేరు: గిరిజన విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కరువైంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో వైద్య సేవలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయి. గత 18 నెలల కాలంలోనే వివిధ అనారోగ్య సమస్యలతో ఏడుగురు గిరిజన విద్యార్థులు మృత్యువాత పడటం గిరిజన గ్రామాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అమలుకాని ఎన్నికల హామీలు, ఎన్నికల సమయంలో అరకు వేదికగా చంద్రబాబు ఇచ్చిన ‘హెల్త్‌ వలంటీర్ల’ నియామక హామీ ఇప్పటికీ కాగితాలకే పరిమితమైంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హెల్త్‌ వలంటీర్ల ఫైలుపై తొలి సంతకం చేసినా, క్షేత్రస్థాయిలో ఆ ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. ఫలితంగా సుమారు 61,306 మంది గిరిజన విద్యార్థులకు అత్యవసర వైద్యం అందడం లేదు.

రక్తహీనతతో ఆగుతున్న ప్రాణాలు

ఆశ్రమ పాఠశాలల్లో రక్తహీనత సమస్య పంజా విసురుతోంది. ఈ నెల 6న పెదబయలు మండలానికి చెందిన వంతాల నందిని, గతేడాది డిసెంబర్‌ 29న పాంగి నిర్మల రక్తహీనత కారణంగానే మరణించడం గమనార్హం. వీరిద్దరిలోనూ హిమోగ్లోబిన్‌ శాతం 5 కన్నా తక్కువ ఉండటం వైద్య విభాగాల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. ప్రస్తుతం అరకులోయ గురుకులానికి చెందిన చంటి, చంటిబాబు అనే విద్యార్థులు కూడా ఇదే సమస్యతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.

పాలకుల నిర్లక్ష్యం

కన్నబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను పరామర్శించేందుకు కనీసం స్థానిక అధికారులు, అధికార పార్టీ నేతలు వెళ్లకపోవడం శోచనీయం. నిరుపేద గిరిజన కుటుంబం కాబట్టి, ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని గిరిజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

చికిత్స పొందుతున్న చంటి, చంటిబాబు

జిల్లా సమాచారం

నియోజకవర్గాలు : పాడేరు, అరకు

గిరిజన ఆశ్రమ

పాఠశాలలు : 117

విద్యార్థుల సంఖ్య : 41,128

పోస్ట్‌మెట్రిక్‌ హాస్టళ్లు : 33

విద్యార్థుల సంఖ్య : 8,272

గురుకుల విద్యాలయాలు : 31

విద్యార్థుల సంఖ్య : 11,906

మృతుల వివరాలు

2024 సెప్టెంబర్‌ 10న అనంతగిరి మండలం ఎగువశోభలో పాంగి జెసికా (4)

2024 సెప్టెంబర్‌ 17న అనంతగిరి మండలం టోకూరు ఆశ్రమ పాఠశాలలో సూకురు అప్పలకొండ (8వ తరగతి)

2024 సెప్టెంబర్‌ 17న అనంతగిరి మండలం పినకోట పాఠశాలకు చెందిన శిరగం లాస్య (5వ తరగతి)

2024 సెప్టెంబర్‌ 22న పాడేరు జూనియర్‌ కళాశాలకు చెందిన పూజారి లక్ష్మీప్రియ (ఇంటర్‌)

2025 జూలై 2న జి.మాడుగుల మండలం బందవీధి ఆశ్రమ పాఠశాలకు చెందిన మర్రి లక్ష్మి (8వ తరగతి

2025 డిసెంబర్‌ 29న గూడెంకొత్తవీధి మండలం సీలేరు ఆశ్రమ పాఠశాలకు చెందిన పాంగి నిర్మల

2026 జనవరి 6న పెదబయలు మండలం తురకలవలస ఆశ్రమ పాఠశాలకు చెందిన వంతాల నందిని

ప్రభుత్వం బాధ్యత వహించాలి

గిరిజన విద్యాలయాల్లో వి ద్యార్థుల మరణాలపై సమ గ్ర విచారణ జరపాలి. అనారోగ్య సమస్యలతో సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందక గిరిజన విద్యార్థులు మృతిచెందడం బాధాకరం. విద్యార్థుల మరణాలకు చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాలి.

– లోచలి వరప్రసాద్‌, జిల్లా అధ్యక్షుడు,

వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం

వైద్య సిబ్బందిని నియమించాలి

అన్ని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో వైద్యసిబ్బందిని వెంటనే నియమించాలి.హెల్త్‌ వలంటీర్లను నియమిస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హమీని నిలబెట్టుకోకపోవడం అన్యాయం. గిరిజన విద్యార్థుల మరణాలకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి.

– బూడిద మాధవ్‌, జిల్లా అధ్యక్షుడు,గిరిజన విద్యార్థి సంఘం

పూర్తిస్థాయిలో వైద్యసేవలు

ఆశ్రమ పాఠశాలలతో పాటు అన్ని గిరిజన విద్యాలయాల్లో వైద్యసేవలకు చర్యలు తీసుకుంటున్నాం. సచివాలయ వైద్యసిబ్బందితో పాటు పీహెచ్‌సీల వైద్యులతో అన్ని విద్యాలయాల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల్లో రక్తహీనత సమస్య ఉంటే అదనంగా పౌష్టికాహారం పంపిణీకి, మెరుగైన వైద్యసేవలకు ఆదేశాలిచ్చాం.

–పీబీకే పరిమళ, డిప్యూటీ డైరెక్టర్‌,

గిరిజన సంక్షేమశాఖ, పాడేరు ఐటీడీఏ

రాలిపోతున్న పసిమొగ్గలు 1
1/6

రాలిపోతున్న పసిమొగ్గలు

రాలిపోతున్న పసిమొగ్గలు 2
2/6

రాలిపోతున్న పసిమొగ్గలు

రాలిపోతున్న పసిమొగ్గలు 3
3/6

రాలిపోతున్న పసిమొగ్గలు

రాలిపోతున్న పసిమొగ్గలు 4
4/6

రాలిపోతున్న పసిమొగ్గలు

రాలిపోతున్న పసిమొగ్గలు 5
5/6

రాలిపోతున్న పసిమొగ్గలు

రాలిపోతున్న పసిమొగ్గలు 6
6/6

రాలిపోతున్న పసిమొగ్గలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement