గిరిజన విద్యార్థుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే..
నివారణ చర్యలు చేపట్టకపోవడం విచారకరం
చంద్రబాబు పాలనలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు శూన్యం
ఇప్పటికై నా ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీర్లను నియమించాలి
పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు
పాడేరు: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, గిరిజన గురుకులాలు, కస్తూర్భా విద్యాలయాల్లో విద్యార్థులు అనారోగ్యం బారిన పడి మృతి చెందుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్టు వ్యవహరిస్తోందని పాడేరు ఎమెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు ధ్వజమెత్తారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గిరిజన విద్యార్థుల మరణాలన్ని ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. వారం రోజుల వ్యవధిలో పెదబయలు మండలం తురకలవలస ఆశ్రమ పాఠశాల, సీలేరు పాఠశాలల్లో గిరిజన విద్యార్థులు అనారోగ్యానికి గురై మృతి చెందారన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో, వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు లేవన్నారు. విద్యార్థులు తాగేందుకు సురక్షిత తాగునీరు కరువైందన్నారు. చలికాలంలో విద్యార్థులు చన్నీటితో స్నానం చేస్తూ ఎన్నో అవస్థలు పడుతున్నారన్నారు. ఏ వసతి గృహంలో కూడా మెనూ సక్రమంగా అమలు కావడం లేదన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్ని పాఠశాలలు, వసతి గృహాలను నాడు–నేడు పథకంలో రూ.కోట్లు వెచ్చించి ఆధునికీకరించి, సౌకర్యాలు కల్పించిందన్నారు. నేడు నిర్వాహణ లోపం కారణంగా అవి మరమ్మతులకు గురవుతున్నాయన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్‌వలంటీర్లను నియమిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా గిరిజనులను మోసం చేసిందన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, తక్షణమే హెల్త్ వలంటీర్లను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.


