జోలాపుట్టులో వాటర్ ఏరోడ్రోమ్స్
ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఉన్న జోలాపుట్టు జలాశయం పరిసరాలను అభివృద్ధి చేయడంలో భాగంగా వాటర్ ఏరోడ్రోమ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పాడేరు డీఎఫ్‌వో కె.ఉమామహేశ్వరి అన్నారు. మండలంలోని జోలాపుట్టు పంచాయతీ కేంద్రం సరిహద్దులో ఉన్న జోలాపుట్టు జలాశయం, పరిసరాల ప్రాంతాలను ఆమె శుక్రవారం సందర్శించారు. జలాశయం విస్తరించిన ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. ఏరోడ్రోమ్స్ ఏర్పాటు చేస్తే పర్యాటకులు హెలికాప్టర్‌లో విహరించి జలాశయంలో దీవులను తిలకించవచ్చన్నారు. సరిహద్దు ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అనంతరం బోండ్రుగూడ అటవీప్రాంతంలో గుగ్గిలం పవిత్రవనాలను పరిశీలించారు. శేషాచలం ప్రాంతం నుంచి తీసుకువచ్చి ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన తలూర రకం గుగ్గిలం వనాలను పరిశీలించారు.
మండల కేంద్రంలోని అటవీశాఖ రేంజ్ కార్యాలయం భవన మరమ్మతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ముంచంగిపుట్టు అటవీ రేంజ్ అధికారి ఎం.మురళీకృష్ణ, ఎఫ్‌ఎస్‌వో నారాయణపడాల్, ఎఫ్‌బీవోలు శ్రీను, వెంకటరాజు, రామారావు, ,గ్రామ రెవెన్యూ అధికారి రమేష్ పాల్గొన్నారు.


