ఆంక్షల కంచె..
అక్షర ధామంలో
వీసీని కలవాలన్నా గండమే..
ఏయూ గేట్లకు నో ఎంట్రీ బోర్డులు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మునుపెన్నడూ లేని విధంగా కఠిన నిబంధనలు, ఆంక్షలు అమల్లోకి రావడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వవిద్యాలయ పాలనా యంత్రాంగం అనుసరిస్తున్న తీరు నియంతృత్వ ధోరణిని తలపిస్తోందని విద్యార్థి లోకం మండిపడుతోంది. ముఖ్యంగా వర్సిటీ పెద్ద దిక్కులైన వీసీ, రిజిస్ట్రార్‌లను కలిసేందుకు కూడా వీల్లేదంటూ జారీ చేసిన తాజా సర్క్యులర్ వర్సిటీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. విద్యార్థులు సంక్రాంతి సెలవుల్లో ఉన్న సమయాన్ని చూసి ఇటువంటి కఠిన నిర్ణయాలు అమలు చేయడంపై సర్వత్రా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి.
ఆంక్షలపై వాగ్వాదం
ప్రస్తుతం ఏయూలో ఇతరుల ప్రవేశాన్ని పూర్తిగా నిరోధిస్తూ ‘నో ఎంట్రీ’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నగర నడిబొడ్డున ఉన్న ఈ సువిశాల ప్రాంగణంలో ఇప్పటివరకు ఉన్న రాకపోకల వెసులుబాటును రద్దు చేస్తూ ప్రధాన ద్వారాలను మూసివేశారు. ఆఖరికి కలెక్టర్ బంగ్లాకు వెళ్లే మార్గాన్ని కూడా పరిమితం చేస్తూ నిబంధనలు విధించడం గమనార్హం. కేవలం సౌత్ క్యాంపస్ ఇన్–గేట్, బీచ్ రోడ్డు అవుట్–గేట్ ద్వారా మాత్రమే రాకపోకలు సాగించాలని వీసీ ఆదేశించడంతో వర్సిటీలో కలకలం రేగుతోంది. కేవలం ఐడీ కార్డులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తుండటంతో, కార్డులు మర్చిపోయిన సిబ్బంది, విద్యార్థులు సెక్యూరిటీ గార్డులతో వాగ్వివాదానికి దిగాల్సి వస్తోంది.
అనుబంధ కళాశాలల విద్యార్థుల పడిగాపులు
ఈ నిబంధనల వల్ల ఏయూ అనుబంధ కళాశాలల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు విస్తరించి ఉన్న అనుబంధ సంస్థల విద్యార్థులు తమ సర్టిఫికెట్లు, ఓడీల కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంటారు. అయితే గేటు వద్దే వారిని అడ్డుకుంటుండటంతో ఉన్నత విద్య అభ్యసించిన వారు కూడా పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు, తమను కలవడానికి వచ్చే వారికి వీసీ, రిజిస్ట్రార్‌లు గ్రీవెన్స్ సెల్ మార్గాన్ని సూచించడం విడ్డూరంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. పాలనాధిపతులు విద్యార్థులకు అందుబాటులో ఉండకపోతే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
నియంత పాలనకు శ్రీకారం
వీసీని, రిజిస్ట్రార్లను ఎవరూ నేరుగా కలిసేందుకు వీలులేదని, సమస్యలుంటే గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసుకోవాలని నిబంధనలు పెట్టారు. ప్రతి ఒక్కరూ పాలనాధిపతులను కలవడం వలన వర్సిటీలో పాలనకు అంతరాయం కలుగుతుందని వీసీ జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొనడం విడ్డూరంగా ఉందంటూ వర్సిటీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. నియంతృత్వ నిబంధనలతో ఏయూను నిర్బంధించడంపై పలు విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఏయూ వీసీ, రిజిస్ట్రార్‌ను కలవడానికి ఆంక్షలు పెట్టడమేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శతాబ్ది వేళ...అప్రతిష్ట
శతాబ్ది ఉత్సవాల వేళ ఏయూ ప్రతిష్టను పెంచాల్సింది పోయి, ఇలాంటి వింత పోకడలతో ఆభాసుపాలు చేస్తున్నారని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పాలనాపరమైన ఆంక్షలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు బోధనారంగం గాడితప్పుతోంది. 14 విభాగాల్లో రెగ్యులర్ ప్రొఫెసర్లు లేక, గెస్ట్ లెక్చరర్లతో కాలం వెల్లదీస్తున్నారు. నాణ్యమైన విద్య అందక విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల వైపు చూస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సింది పోయి, కేవలం ఆంక్షలతో విశ్వవిద్యాలయాన్ని బందీ చేయడమేంటని విద్యావేత్తలు నిలదీస్తున్నారు.
ఏయూలో రాకపోకల సంక్షోభం
కఠిన నిబంధనలపై కలకలం.. విద్యార్థుల ఆందోళన


