విశాఖ తీరాన ఎగసిన కార్మిక కెరటం
చంద్రబాబు, మోదీల వైఖరిపై సీఐటీయూ ఉక్కుపిడికిలి బాబు పాలనపై సీఐటీయూ నేతల ఆగ్రహం హామీలకే పరిమితమైన లోకేష్, పవన్ జగదాంబ నుంచి స్టేడియం వరకు కార్మికుల భారీ ప్రదర్శన
జగదాంబ: రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన కార్మిక లోకంతో విశాఖ నగరం జనసంద్రమైంది. సీఐటీయూ అఖిల భారత మహాసభల సందర్భంగా నిర్వహించిన భారీ ప్రదర్శనతో నగరం ఎరుపెక్కిపోయింది. జగదాంబ సెంటర్ నుంచి ఇందిరా మున్సిపల్ స్టేడియం వరకు జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది కార్మికులు పాల్గొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తారు. కార్మిక చట్టాలను అమలు చేయాలి.. లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి అంటూ చేసిన నినాదాలతో విశాఖ వీధులు హోరెత్తాయి. జీవీఎంసీ 39వ వార్డులోని ఇందిరా మున్సిపల్ క్రికెట్ స్టేడియంలో సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ కె. హేమలత అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య నాయకులు తపన్ సేన్, కరీం, గఫూర్, నర్సింగరావు, సాయిబాలు ప్రసంగిస్తూ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. 2019లో పరాజయం పాలై, 2024లో మారతానంటూ ప్రజల కాళ్లు పట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మళ్లీ పాత పద్ధతులనే అవలంబిస్తున్నాడని విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో చేతులు కలిపి కార్మికులను ఉక్కుపాదంతో తొక్కుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 50 లక్షల మంది కార్మికులకు చట్టబద్ధమైన వేతన సవరణ జరగడం లేదని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు, పెన్షన్, పీఎఫ్ సౌకర్యాలు లేకపోవడం శోచనీయమ న్నారు. దేశాన్ని అమ్మడమే పనిగా పెట్టుకున్న మోదీకి చంద్రబాబు మద్దతు తెలపడం కార్మికులకు చేస్తున్న అన్యాయమని, కార్మిక మంత్రులు కేవలం దిష్టిబొమ్మల్లా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. అంగన్‌వాడీల సమస్యలు తీరుస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోని ఎమ్మెల్యేలను, ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించిన నారా లోకేష్‌ను నాయకులు ప్రశ్నించారు. అలాగే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన శాఖలోని నామమాత్రపు వేతనాలతో పనిచేస్తున్న కార్మికుల కష్టాలను ఎందుకు చూడటం లేదని నిలదీశారు. మార్పు కోసం పనిచేయాల్సిన పవన్ కల్యాణ్, సనాతన ధర్మం పేరిట కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. కనీస వేతన చట్టం–2026ను వెంటనే అమలు చేయాలని, లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సభ తీర్మానించింది. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించడం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. 2025 విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, అసంఘటిత కార్మికులకు ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 12న జరగబోయే అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.
విశాఖ తీరాన ఎగసిన కార్మిక కెరటం
విశాఖ తీరాన ఎగసిన కార్మిక కెరటం


