కట్టుకున్నవాడే కాలయముడు
యలమంచిలి రూరల్: ఒక ఊరూ.. ఒక జిల్లా కాదు..రాష్ట్రాల సరిహద్దు దాటి, తాళికట్టిన బంధాన్ని కాదని, నమ్మినవాడి వెంట వచ్చేసింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఉపాధి కోసం ఉత్తరప్రదేశ్ నుంచి 8 ఏళ్ల కిందట అనకాపల్లి జిల్లా యలమంచిలికి వచ్చారు. తానే సర్వస్వమని నమ్మిన ఇల్లాలి ఊపిరిని అనుమాన భూతంతో లాగేశాడు. తమ ఇద్దరికి పుట్టిన నాలుగు నెలల ఆడబిడ్డ మొహం కూడా చూడకుండా, అతి కిరాతంగా భార్యను కడతేర్చాడు. యలమంచిలి పట్టణం ధర్మవరం సీపీ పేటలో బుధవారం జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాలివి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంత కబీర్ నగర్ జిల్లా నందలూరు గ్రామానికి చెందిన రాకేష్, మాయ దంపతులు 8 ఏళ్ల కిందట యలమంచిలి పట్టణానికి ఉపాధి కోసం వలస వచ్చారు.అంతకుముందే మాయకు వివామైంది. తన మొదటి భర్త ద్వారా 12 ఏళ్లు వయస్సున్న కాజల్ అనే కుమార్తె కూడా వుంది. కుమార్తె పుట్టిన తరువాత ఆమెకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాకేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. రాకేశ్ మాయను వివాహం చేసుకుని 8 ఏళ్ల కిందట ఉపాధి కోసం యలమంచిలి పట్టణానికి వచ్చారు. రాకేశ్, మాయ దంపతులు యలమంచిలిలో కాపురం వుంటూ ధర్మవరం సీపీ పేటలో ఒక తుక్కు (స్క్రాప్) దుకాణాన్ని లీజుకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇటీవల రాకేష్, మాయ దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం ఆ చిన్నారికి నాలుగు నెలలు. గత కొంతకాలంగా భార్య మాయ తమ సొంతూరుకు చెందిన ఒక యువకుడితో ఫోన్ ద్వారా తరచూ మాట్లాడుతున్నట్టు రాకేష్ అనుమానం పెంచుకున్నాడు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో బయటకు వెళ్లొచ్చిన రాకేష్ తన భార్య ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతుండడం గమనించి ఆవేశంతో ఊగిపోయాడు. ఇద్దరి మధ్య మాటా, మాటా పెరిగింది. ఈ సమయంలో నియంత్రణ కోల్పోయిన రాకేష్, ఆవేశంలో అతి కర్కశకంగా ప్రవర్తించాడు. ఆమెను విచక్షణారహితంగా కొట్టి, అక్కడున్న స్క్రూ డ్రైవర్‌తో ఛాతికి, మెడకు మధ్య భాగాన పొడిచేశాడని పోలీసులు చెప్పారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను ఆటోలో స్థానిక కమలా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అక్కడ ఆక్సిజన్ సదుపాయం లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. యలమంచిలి సీహెచ్‌సీకి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్టు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఉత్తర ప్రదేశ్ నుంచి వారు వచ్చే వరకూ మృతదేహం పాడవ్వకుండా అనకాపల్లి ఎన్‌టీఆర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చినట్టు సీఐ ధనుంజయరావు చెప్పారు. తన భార్యను తానే హత్య చేశానని రాకేష్ అంగీకరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వీఆర్వో పిల్లి మారేశ్వర్రావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య ఘటనలో నాలుగు నెలల చిన్నారి అనాథగా మారింది. స్థానిక మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పాపను సాయంత్రం వరకు సంరక్షించారు. పోలీసులు పసిబిడ్డను అనకాపల్లి ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌కు ఆ పాపను అప్పగించారు.
కట్టుకున్నవాడే కాలయముడు
కట్టుకున్నవాడే కాలయముడు


