రూ.కోట్లు గుల్ల.. నాణ్యత డొల్ల | - | Sakshi
Sakshi News home page

రూ.కోట్లు గుల్ల.. నాణ్యత డొల్ల

Dec 25 2025 8:11 AM | Updated on Dec 25 2025 8:11 AM

రూ.కో

రూ.కోట్లు గుల్ల.. నాణ్యత డొల్ల

నాసిరకంగా అడ్డురోడ్డు–నర్సీపట్నం రోడ్డు నిర్మాణం

రూ.24 కోట్ల ఆర్‌అండ్‌బీ నిధులతో

13 కిలోమీటర్ల రహదారి

ప్రారంభంలోనే నాణ్యత లోపం బట్టబయలు

రెండు నియోజకవర్గాలనే కాక రెండు జిల్లాలను కలిపే ముఖ్యమైన రహదారి అది.. రూ.24 కోట్ల ఆర్‌అండ్‌బీ నిధులతో అడ్డురోడ్డు నుంచి రామచంద్రపురం వరకు నిర్మిస్తున్నారు. అంత వ్యయం చేస్తున్న రోడ్డు నిర్మాణంలో ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని పనులు జరిగే తీరు గమనిస్తున్న ప్రజలు పెదవి విరుస్తున్నారు. కూటమి పార్టీలకు ఇష్టుడైన కాంట్రాక్టర్‌కు అప్పచెప్పడం వల్లే నిధులు దుర్వినియోగమవుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నక్కపల్లి/ఎస్‌.రాయవరం: అడ్డురోడు– నర్సీపట్నం ఆర్‌అండ్‌బీ మార్గంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పనుల ప్రారంభంలోనే డొల్లతనం బయటపడుతోంది. సుమారు 13 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డు ఎంతో ముఖ్యమైనది. పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాలను కలిపే రహదారి మాత్రమే కాక ఈ మార్గం అల్లూరి సీతారామరాజు జిల్లాకు కూడా దారి తీస్తుంది. ప్రతి రోజు వేలాదిమంది ఈ రోడ్డుపై ప్రయాణిస్తారు. ఈ రోడ్డు నిర్మాణానికి ఎనిమిది నెలల ముందు శంకుస్థాపన చేసినప్పటికీ పనులు మాత్రం ఇటీవలే ప్రారంభమయ్యాయి. రూ.24 కోట్ల ఆర్‌ అండ్‌ బీ నిధులతో నిర్మించే ఈ రోడ్డు పనుల కాంట్రాక్ట్‌ దక్కించుకున్న వ్యక్తి కూటమి పార్టీలకు బాగా కావాల్సిన వాడు కావడంతో పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నా పట్టించుకోవడం లేదు.

అడిగే నాథులేరి? : రూ.24 కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్న రోడ్డు నాలుగు కాలాల పాటు మన్నాలంటే నాణ్యత పాటించాలి. క్రషర్‌ నుంచి తెచ్చిన నల్లపిక్కను నీటితో పూర్తిగా శుభ్రం చేయాలి. పాతరోడ్డుపై ఉన్న చెత్తను మట్టిని పూర్తిగా శుభ్రం చేసి దానిపై నల్లపిక్క, బూడిద, లైట్‌గా తారు కలిపి రోడ్డుపై తడుపుతూ బాగా రోలింగ్‌ చేయాలి. మరోసారి రోలింగ్‌ చేసి తదుపరి తారు రోడ్డు నిర్మించాల్సి ఉంటుంది. బెర్మ్‌ల వద్ద కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నల్లపిక్క, బూడిద తారు కలిపి పటిష్టంగా రోలింగ్‌ చేయాలి. బెర్మ్‌లు పటిష్టంగా లేకపోతే రోడ్డు కోతకు గురై క్రమేపీ మొత్తం పాడయిపోతుంది. గతంలో అయితే నల్లపిక్కలో బంకమన్ను కలిపి రోడ్డుపై వేసి బాగా రోలింగ్‌ చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అలా ఎవరూ చేయడం లేదు. పాత రోడ్డును అలాగే వదిలేసి దానిపై బూడిద కలిపిన పిక్కను వేసి తూతూమంత్రంగా రోలింగ్‌ చేస్తున్నారు. రోలింగ్‌ సమయంలో నీటితో తడపాలి. కానీ ఎక్కడ నీటితో తడిపిన దాఖలాలు కనిపించడం లేదు. వేసిన పిక్క వేస్తున్నట్లుగానే పైకి లేచిపోతోంది. నీటితో తడిపి రోలింగ్‌ చేసిన తర్వాత తారురోడ్డు వేస్తే నాణ్యంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇలా వేయడం వల్ల తారు రోడ్డు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు జరిగే చోట ఇంజినీరింగ్‌ సిబ్బంది కనిపించడం లేదు. పర్యవేక్షణ లేకపోవడం వల్ల రోడ్డు పనులు నాణ్యతాలోపంతో జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రతి రోజూ వందలాది వాహనాలు వెళ్లే మార్గం

అడ్డురోడ్డు నుంచి నర్సీపట్నం వరకు ట్రాఫిక్‌ విపరీతంగా ఉంటుంది. మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీకి ముఖద్వారమైన అడ్డురోడ్డు నుంచి నిత్యం వేలాది మంది వందలాది వాహనాల్లో నర్సీపట్నం రాకపోకలు సాగిస్తుంటారు. అంత ముఖ్యమైన రోడ్డయినా అధికారులు, కూటమి ప్రజాప్రతినిధులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే మాదిరిగా గునిపూడి నుంచి పెంటకోట వెళ్లు రోడ్డు వేయడం వల్ల అది నెల రోజులకే పెచ్చులు ఊడిపోయిందని ప్రజలు గుర్తు చేస్తున్నారు. నిధులు మంజూరు చేయించి చేతులు దులుపేసుకుంటే సరిపోదని, నిబంధనలు, నాణ్యత పాటిస్తున్నారో లేదో హోం మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రూ.కోట్లు గుల్ల.. నాణ్యత డొల్ల 1
1/1

రూ.కోట్లు గుల్ల.. నాణ్యత డొల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement