
సబ్‌సెంటర్ పరిధిలోని గ్రామాల్లో పర్యటించాలి
రంపచోడవరం: ప్రతీ సబ్ సెంటర్‌లో వివిధ వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచాలని పీవో కట్టా సింహాచలం అన్నారు. ముసురుమిల్లి గ్రామంలోని ఆయన శుక్రవారం పర్యటించారు. ఇందులో భాగంగా గ్రామంలోని ఏఎన్‌ఎం సబ్ సెంటర్, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పీవో మాట్లాడుతూ ఏజెన్సీలో సబ్ సెంటర్‌లో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సబ్ సెంటర్ పరిధిలో ఏఎన్‌ఎంలు పర్యటించి జ్వరాలు ఉన్న వారిని గుర్తించి రక్త నమూనాలు సేకరించి వ్యాధులు నిర్ధారించి మందులు ఇవ్వాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా స్ప్రేయింగ్ చేయించాలని సూచించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ చిన్నారులతో కొంతసేపు ముచ్చటించారు. చిన్నారులకు ఆటపాటలతో చదువుపై దృష్టి పెట్టే విధంగా ప్రోత్సాహించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు గుడ్లు, పాలు సక్రమంగా అందించాలన్నారు. పీవో వెంట ఏడీఎంహెచ్‌ఓ డేవిడ్ తదితరులున్నారు.
నాణ్యత లేని చిక్కీలు సరఫరా చేస్తే చర్యలు
ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే చిక్కీలు నాణ్యతగా ఉండాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని పీవో కట్టా సింహాచలం హెచ్చరించారు. నాణ్యత లేని చిక్కీలు సరఫరా చేస్తున్నారని ప్రచార మాద్యమాల్లో వచ్చిన విషయంపై పీవో స్పందించారు. నాణ్యత లేని చిక్కీలు సరఫరా చేస్తే బిల్లులు చెల్లించబడవని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పాఠశాలలకు సరఫరా చేసిన చిక్కీలు నాణ్యతపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని పీవో అధికారులను ఆదేశించారు.
ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం