
గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
రంపచోడవరం: ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. మారేడుమిల్లి మండలం దేవరపల్లిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను పీవో బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులు , ఉపాధ్యాయుల సంఖ్యపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పీవో సింహాచలం మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆశ్రమ పాఠశాల పరిసరాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. మాంసం, గుడ్లు, నిత్యావసరాలు వెండర్లు సక్రమంగా సరఫరా చేస్తున్నారా లేదా అని హెచ్‌ఎం, వార్డెన్‌లతో మాట్లాడి తెలుసుకున్నారు. సరఫరాలో ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఇంటి వెళ్లి పాఠశాలకు తిరిగి రాని విద్యార్థులుంటే వారిని వారం లోపు ఉపాధ్యాయులు పాఠశాలకు తీసుకురావాలని, లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పెదగెద్దాడ ఎంపీపీ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు తదితర సామగ్రి పంపిణీపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలిచ్చారు.
రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం

గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ