
పెదబయలు జీసీసీలో నిధుల దుర్వినియోగం
పెదబయలు: గిరిజన సహకార సంస్థ పెదబయలు బ్రాంచిలో సుమారు రూ.1.50 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయి. దీంతో బుధవారం జీసీసీ ప్రధాన కార్యాలయం డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీఆర్‌సీ) సూర్యనారాయణ రంగంలోకి దిగారు. ఆయన బ్రాంచి కార్యాలయాన్ని బుధవారం తనిఖీ చేశారు. లావాదేవీలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అప్పట్లో పనిచేసిన మేనేజర్, సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి బ్రాంచి మేనేజర్ ఓలేసి గాసీ, జూనియర్ అసిస్టెంట్ సాగేని దీనాకుమారి, పెట్రోల్ బంక్ గతంలో నిర్వాహకులు రమణ, కొంత మంది సేల్స్‌మెన్ల విచారించినట్టు తెలిపారు. అటవీ ఉత్పత్తులు, కాఫీ, మిరియాలకు సంబంధించి సంస్థ నుంచి తీసుకున్న నిధుల మేరకు కొనుగోలు చేయకుండా జీసీసీ సొమ్మును పక్కదారి పట్టించినట్టు అంతర్గత ఆడిట్‌లో బయటపడిందన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే జూనియర్ అసిస్టెంట్ దీనాకుమారీని ఉన్నతాధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారన్నారు. ఆమె రూ.కోటి, గతంలో పనిచేసిన మేనేజర్ ఓలేసి గాసీ, జీసీసీ పెట్రోల్ బంక్ నిర్వాహకులు రమణ కొంత మంది సేల్స్‌మన్లు కలిసి మరో రూ.50 లక్షలు నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలిపారు. విచారణ నివేదికను జనరల్ మేనేజర్‌కు అందజేస్తామన్నారు. స్థానిక జీసీసీ బ్రాంచి మేనేజర్ అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
రూ.1.50 కోట్లు పక్కదారి
గిరిజన ఉత్పత్తుల కొనుగోలు
పేరుతో స్వాహా
విచారణ నిర్వహించిన
ఉన్నతాధికారి సూర్యనారాయణ
లావాదేవీల రికార్డులు పరిశీలన