
నిర్లక్ష్యానికి నిదర్శనం
● గంగవరంలో కొట్టుకుపోయిన వంతెన
● కర్రలతో తాత్కాలిక నిర్మాణం
● రాకపోకలకు గ్రామస్తుల అవస్థలు
● పట్టించుకోని అధికారులు
సీలేరు : గూడెం మండలం దారకొండ నుంచి ఒడిశా వెళ్లే మార్గ మధ్యలో గంగవరం వద్ద వంతెన ఇటీవల తుపానుకు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక స్థానికులు కర్రలతో తాత్కాలిక వంతెనను నిర్మించుకున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలతో గంగవరం గ్రామంలో వంతెన కొట్టుకుపోయింది. అప్పటి నుంచి వంతెన నిర్మించాలని ధర్నాలు, పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా కూటమి ప్రభుత్వం కనీసం స్పందించలేదని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు వంతెన కోసం ప్రతిపాదనలు పంపినా కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదంటున్నారు. కర్రలతో తాత్కాలికంగా నిర్మించిన వంతెనపై బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నామని, ఎప్పుడు కూలుతుందోనని భయాందోళన చెందుతున్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సైతం వరదపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఆంధ్ర–ఒడిశాకి రాకపోకలు నిలిచిపోయాయని చెప్పారు. నిత్యావసర సరకులు తెచ్చుకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి గంగవరం వద్ద వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.