
నిర్థారిత వేతనాలు అందజేయాలి
పాడేరు : ఎన్‌ఎంఆర్ వేతనాల స్థిరీకరణలో నిర్థారిత వేతనాలు అందజేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అన్నారు. బుధవారం ఐటీడీఏలోని తన ఛాంబర్‌లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దినసరి వేతనాల స్థిరీకరణపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్‌ఎంఆర్ టెక్నికల్/నాన్ టెక్నికల్ వేతనాలను స్థిరీకరించారు. నాన్ టెక్నికల్ స్కిల్డ్ రూ.629, సెమీస్కిల్డ్ రూ.524, అన్ స్కిల్డ్ రూ.472లుగా స్థిరీకరణ చేయగా టెక్నికల్ ఐటీఐ క్వాలిఫికేషన్ వర్క్ ఇన్‌స్పెక్టర్ రూ.739, ఎల్సీఈ/ఎంఎల్‌ఈ/ఎల్‌ఈఈ వర్క్ ఇన్‌స్పెక్టర్లకు రూ.1022లు, బీఈ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్)కు రూ.1315 చొప్పున స్థిరీకరించామన్నారు. ఇవి 2024 జూలై ఒకటి నుంచి 2025 జూన్ 30 వరకు జిల్లా వ్యాప్తంగా వర్తిస్తుందన్నారు. ఈ సమావేశానికి కార్మిక శాఖ సహాయ కమిషనర్ టి.సుజాత, ముఖ్య ప్రణాళిక అధికారి పి.ప్రసాద్, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ టి. ప్రతాప్, ఇరిగేషన్ ఎస్‌ఈ ఆర్. నాగేశ్వరరావు, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఎం. తులసి, పారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎ.ప్రేమ, సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ