
జాజులబందలో బాలుడి మృతి
● గత నెలలో తల్లి..
● రహదారి లేక ఆస్పత్రికి తరలించలేని వైనం
కొయ్యూరు: మండలంలోని మూలపేట పంచాయతీ జాజులబందలో దగ్గు, ఆయాసంతో మూడునెలల బాలుడు మృతి చెందాడు. రహదారి సౌకర్యం లేక ఆస్పత్రికి తీసుకువెళ్లలేకపోయామని బాలుడి తండ్రి మర్రి కామేశ్వరరావు బుధవారం సాయంత్రం కన్నీటిపర్యంతమయ్యాడు. గత నెల పదో తేదీన అనారోగ్యంతో భార్య (బాలుడి తల్లి) కావ్య మృతి చెందిందని తెలిపారు. అప్పటినుంచి బాబు అనారోగ్యంతో ఉన్నాడని.. ఈనేపథ్యంలో రెండు రోజులుగా దగ్గు ఎక్కువగా వస్తోందని చెప్పాడు. ఆస్పత్రికి తీసుకువెళ్దామని అనుకుంటున్న సమయంలో ఆయాసం ఎక్కువగా రావడంతో ఆరోగ్యం విషమించిందన్నాడు. ఎవరికి అనారోగ్యం వచ్చినా రహదారి లేకపోవడంతో ఆస్పత్రికి తరలించేందుకు నరకం చూస్తున్నామని వాపోయాడు. దీనిపై డౌనూరు వైద్యాధికారి వినయ్‌కుమార్ మాట్లాడుతూ కొద్ది రోజుల కిందట ఆస్పత్రికి వచ్చిన తండ్రి కామేశ్వరరావునుబాలుడి ఆరోగ్య వివరాలు అడిగామన్నారు. పాలు పట్టించాలని సూచించామని ఆయన పేర్కొన్నారు.