
ఉరకలై గోదావరి..
విలీన మండలాలు ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో గోదావరి ఉధృతి కొనసాగుతోంది. శబరినది కూడా ఎగపోటుకు గురికావడంతో చింతూరు మండలంలో కూడా వరద క్రమేపీ పెరుగుతోంది. మరోపక్క వాగులు పొంగి వరదనీరు రహదారులపైకి చేరడంతో నాలుగు మండలాల్లో సుమారు 86 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి భారీగా వరదనీరు విడుదల అవుతుండటంతో బుధవారం రాత్రి 10 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో ప్రమాదహెచ్చరిక జారీచేసి లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు.
● విలీనంలో పెరుగుతున్న నీటిమట్టం ● ముంపులో 86 గ్రామాల రహదారులు ● భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ ● గురువారం నాటికి నీటిమట్టం 50 అడుగులకు చేరే అవకాశం ● అప్రమత్తమైన అధికార యంత్రాగం
చింతూరు/వీఆర్‌పురం: వరదనీరు రహదారులపై చేరడంతో వీఆర్‌పురం మండలంలో 55 గ్రామాలకు, చింతూరు మండలంలో 20 గ్రామాలకు, కూనవరం మండలంలో 7 గ్రామాలకు, ఎటపాక మండలంలో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
● కూనవరం మండలం పోలిపాక, ఎటపాక మండలం మురుమూరు మధ్య గోదావరి వరద నీరు ప్రధాన రహదారిపై చేరింది. దీంతో భద్రాచలం, కూనవరం మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వరద మరింత పెరిగితే గ్రామాలను ముంచెత్తే అవకాశముంది.
● చింతూరు మండలంలో బుధవారం ఉదయానికి శబరినది వరద కొంతమేర తగ్గినప్పటికీ గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో శబరినది ఎగపోటుకు గురై మధ్యాహ్నం నుంచి మళ్లీ పెరిగింది. ఆంధ్రా–ఒడిశా జాతీయ రహదారి–326పై కుయిగూరువాగు వరదనీరు తొలగడంతో సాయంత్రం వరకు రాకపోకలు కొనసాగాయి. మళ్లీ వరద పెరగడంతో రాకపోకలు తిరిగి నిలిచిపోయాయి.
● వీఆర్‌పురం మండలంలోని చింతరేగుపల్లి, కన్నాయిగూడెం, అడవి వెంకన్నగూడెం, తుష్టివారిగూడెం, రామవరం, రామవరంపాడు, అన్నవరం, రేఖపల్లి, ఇప్పూరు, పోచవరం, కొత్తూరు, చుక్కనపల్లి, శ్రీరామగిరి, సీతంపేట, కొల్తునూరు, వడ్డిగూడెం, రాజుపేట గ్రామాల పరిధిలో 55 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద పెరుగుతున్నందున రెవెన్యూ అధికారులు అప్రమత్తమై మండలంలో వరద పరస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద పెరుగుతున్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని తహసీల్దార్ సరస్వతి సూచించారు.
సమీక్షిస్తున్న యంత్రాంగం
వరద పరిస్థితిని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వరద పెరుగుతున్నందున క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా వుండాలని అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఐటీడీఏ కార్యాలయ హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. సహాయక చర్యల నిమిత్తం నాలుగు మండలాలకు పోలవరం డిప్యూటీ కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. కూనవరం, వీఆర్‌పురం మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను బుధవారం ఎస్పీ అమిత్‌బర్దర్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ శుభం నొఖ్వాల్, ఓఎస్డీ జగదీష్ అడహళ్లి, చింతూరు ఏఎస్పీ పంకజ్‌కుమార్‌మీనా పరిశీలించారు.
కూనవరం వంతెనపైనుంచి వరద పరిస్థితిని పరిశీలిస్తున్న ఎస్పీ అమిత్‌బర్దర్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ శుభం నొఖ్వాల్, చింతూరు ఏఎస్పీ
పంకజ్‌కుమార్‌మీనా, ఓఎస్డీ జగదీష్ అడహళ్లి
పడవ కోసం సోకిలేరు వాగువద్ద వేచి ఉన్న గిరిజనులు

ఉరకలై గోదావరి..

ఉరకలై గోదావరి..