
మద్దిగడ్డ నుంచి నీరు విడుదల
అడ్డతీగల: ఎడతెరిపి లేని వర్షాలకు అడ్డతీగలలోని మద్దిగడ్డ జలాశయానికి వరద తాకిడి నెలకొంది. దీంతో అప్రమత్తమైన అధికారులు జలాశయానికి చెందిన రెండు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎఫ్‌ఆర్‌ఎల్ 188 మీటర్లు కాగా ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 186.95 మీటర్లుకు చేరుకుంది. దీంతో జలాశయం 2, 3 నంబర్ల గేట్లను ఐదు సెంటీమీటర్ల మేర పైకి ఎత్తి విడుదల చేస్తున్న వరదనీరు ఏలేరు వాగులో చేరుతోంది. దీనివల్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరివాహక గ్రామాలైన పింజరికొండ, కొత్తపాలెం, గడిచిన్నంపాలెం, డి.కృష్ణవరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగుపై రాకపోకలు సాగించవద్దని ఇంజినీరింగ్ అధికారులు సూచించారు.