
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
● రూ.9.80 లక్షల విలువైన
సొత్తు స్వాధీనం
● పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు
అన్నవరం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను కాకినాడ జిల్లా అన్నవరం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అన్నవరం పోలీస్ స్టేషన్‌లో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆదివారం రాత్రి విలేకరులకు వివరాలు తెలిపారు. అన్నవరం, తుని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇటీవల పలు దొంగతనాలు జరగడంతో, ప్రత్తిపాడు సీఐ సూరిఅప్పారావు పర్యవేక్షణలో అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు, అడిషనల్ ఎస్సై ప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడికి చెందిన అడపా జోగాఅమర్ గంగాధర్, అల్లూరి జిల్లా రంపచోడవరానికి చెందిన అడపా సూర్యచంద్రపై అనుమానంతో పోలీసులు నిఘా ఉంచారు. ఆదివారం ఉదయం వారిద్దరూ మండపాం సెంటర్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చేసిన నేరాలను వారు అంగీకరించారు. వారిని అరెస్ట్ చేసి, వారిచ్చిన సమాచారంతో రూ.9.80 లక్షల విలువైన 500 గ్రాముల వెండి వస్తువులు, అమ్మవారి గుడిలో అపహరించిన రోల్డ్‌గోల్డ్ హారం, మూడు బుల్లెట్లు, ఆరు మోటార్ బైకులు, నాలుగు స్కూటీలు, ఎల్‌ఈడీ టీవీ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై హైదరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో రెండు, విశాఖపట్నం జిల్లా అరిలోవ పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, అన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఎనిమిది, తుని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మూడు, ప్రత్తిపాడు, తుని టౌన్ పోలీస్‌స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదైనట్టు డీఎస్పీ వివరించారు. వీరిని ప్రత్తిపాడు కోర్టుకు తరలించినట్టు చెప్పారు. సమావేశంలో ప్రత్తిపాడు సీఐ సూరిఅప్పారావు, ఎస్సై శ్రీహరిబాబు, అడిషనల్ ఎస్సై ప్రసాద్ పాల్గొన్నారు.

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్