
తల్లిదండ్రులకు చిన్నారుల అప్పగింత
వర్షం కారణంగా ఏపీఎల్ మ్యాచ్‌లు రద్దు
విశాఖ స్పోర్ట్స్ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో భాగంగా వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షం ఆటంకం ఏర్పడింది. రాయలసీమ రాయల్స్, కాకినాడ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను ఐదు ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కాకినాడ కింగ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. ఓపెనర్ భరత్ డకౌట్‌గా వెనుదిరిగినా, లేఖజ్‌రెడ్డి (33), రవికిరణ్ (10) పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ అందించారు. రాయల్స్ బౌలర్లలో గిరినాథ్, సాకేత్‌రామ్ చెరో రెండు వికెట్లు తీశారు. సింహాద్రి వైజాగ్ లయన్స్, భీమవరం బుల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ పూర్తిగా వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
ఏలేరు కాలువలో లభ్యమైన మృతదేహం గుర్తింపు
కశింకోట : తాళ్లపాలెం శివారు బంగారయ్యపేట గ్రామం వద్ద ఏలేరు కాలువలో లభ్యమైన మృతదేహం కేడీ పేటకు చెందిన లోకవరపు బుచ్చియ్యనాయుడు(32)గా గుర్తించినట్టు ఎస్‌ఐ మనోజ్‌కుమార్ ఆదివారం తెలిపారు. శనివారం మృతదేహాన్ని కనుగొన్నామన్నారు. సుమారు పది రోజుల క్రితం నాయుడు విశాఖ నుంచి తమ గ్రామానికి బైక్‌పై వెళుతూ మాకవరపాలెం మండలం చెట్టుపాలెం వద్ద ఏ కారణంగానో ఏలేరు కాలువలో గల్లంతయ్యాడన్నారు. కేడీ పేటలో మిస్సింగ్ కేసు నమోదైందన్నారు. చెట్టుపాలెం నుంచి ఏలేరు కాలువలో ప్రవాహ వేగానికి కొట్టుకు రావడంతో మృతదేహాన్ని పడవలో గాలించి బంగారయ్యపేట వద్ద శనివారం వెలికితీసి గుర్తించినట్టు తెలిపారు.
కొమ్మాది: పీఎంపాలేనికి చెందిన ఐదుగురు చిన్నారులు తల్లిదండ్రులకు చెప్పకుండా ఆదివారం రుషికొండ బీచ్‌కు వచ్చారు. వర్షం పడుతున్నప్పటికీ ఐదుగురు చిన్నారులు ఆ ప్రాంతంలో తిరుగుతుండటం చూసి మైరెన్ పోలీసులు వారిని ప్రశ్నించారు. తాము పీఎంపాలెం నుంచి తల్లిదండ్రులకు చెప్పకుండా ఇక్కడకు వచ్చామని కె.హర్షిన్, ఎ.హశ్వంత్, పి.కల్యాణి, ఎ.హర్షిత, ఎ.వంశీ తెలిపారు. వెంటనే పోలీసులు వారి నుంచి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని.. వారికి సమాచారం అందించారు. రుషికొండకు చేరుకున్న తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లలను సురక్షితంగా అప్పగించారు.