
ఇంజక్షన్ సక్రమంగా చేయక ఇన్‌ఫెక్షన్
● బాధితురాలి భర్త నాయకం శంకర్రావు ఆవేదన
● ముంచంగిపుట్టు వైద్య సిబ్బందిపై ఆరోపణ
ముంచంగిపుట్టు: వైద్య సిబ్బంది ఇంజక్షన్ సక్రమంగా చేయకపోవడంతో తన భార్యకు సెప్టిక్ అయిందని ముంచంగిపుట్టుకు చెందిన నాయకం శంకర్రావు ఆరోపించాడు. దీనివల్ల ఇన్‌ఫెక్షన్ ఎక్కువై కేజీహెచ్‌లో నరకం చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలను అక్కడినుంచి ఫోన్‌లో స్థానిక విలేకరులకు తెలిపాడు. భార్య నాయకం దొసుద(45)కు ఆరోగ్యం బాగులేకపోవడంతో ఈనెల 31న ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తీసుకువెళ్లామన్నారు. వైద్య పరీక్షల అనంతరం వైద్యులు సూచన మేరకు స్టాఫ్ నర్స్ (మెయిల్) రాంబాబు ఆమెకు ఇంజక్షన్ చేశారన్నారు. మూడు రోజుల తరువాత ఆమె చెయ్యికి వాపు, నొప్పి రావడంతో మళ్లీ ఈనెల 4న సీహెచ్‌సీకి తీసుకువెళ్లగా వైద్యసేవలు అందించారన్నారు. వారం రోజులు అవుతున్నా తగ్గకపోవడంతో ఈనెల 12న పాడేరులోని జిల్లా ఆస్పత్రిలో చేర్పించామన్నారు. అక్కడి వైద్యులు పరీక్షించిన అనంతరం చేతికి సెప్టిక్ అయిందని, ఆపరేషన్ చేయాలని చెబుతూ కేజీహెచ్‌కు రిఫర్ చేశారన్నారు. అక్కడ ప్రస్తుతం ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉన్నందున పరిస్థితి విషమంగా ఉందని, ఇంజక్షన్ సక్రమంగా చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై స్థానిక సీహెచ్‌సీ సూపరింటెండెంట్ గీతాంజలిని వివరణ కోరగా దొసుదకు సిబ్బంది ఇంజక్షన్ చేశారని, సెప్టిక్ దేనివల్ల అనేది తెలియాల్సి ఉందన్నారు. దీనికి సబంధించి కొన్ని పరీక్షలు చేసేలోగా దొసుదను కుటుంబ సభ్యులు తమ అనుమతి లేకుండా తీసుకు వెళ్లిపోయారని ఆమె పేర్కొన్నారు.