
చరిత్రను వక్రీకరించేందుకే పాఠ్యాంశాల తొలగింపు
● పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు
డాబాగార్డెన్స్: విశాఖపట్నం: చరిత్రను వక్రీకరించే ఉద్దేశంతోనే పాఠ్యాంశాలను తొలగిస్తున్నారని పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. పాఠ్యాంశాలు మార్చినంత మాత్రాన సత్యం మారిపోదన్న అంశంపై ఆదివారం విశాఖలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎన్‌సీఈఆర్టీ సంస్థ 10, 11వ తరగతుల పుస్తకాల్లోని అనేక పాఠ్యాంశాలను తొలగించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియన్ కాన్‌స్టిట్యూషన్ పాఠ్యాంశంలో మౌలానా అబ్దుల్ కలాంకు సంబంధించిన పేరాను, సైన్స్ విభాగంలో డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని, జీవశాస్త్రంలో పీరియాడిక్ టేబుల్‌ను తొలగించారని ఆయన చెప్పారు. ముఖ్యంగా 8వ తరగతి చరిత్ర పుస్తకంలో మొఘల్ చక్రవర్తులైన అక్బర్, బాబర్, షాజహాన్ తదితరుల చరిత్రను పూర్తిగా తొలగించారని లక్ష్మణరావు తెలిపారు. వారిని కేవలం క్రూరులుగా, దుర్మార్గులుగా చూపించే పేరాలను మాత్రమే ఉంచారని విమర్శించారు. ఎర్రకోట, తాజ్‌మహల్ వంటి నిర్మాణాలు వారి హయాంలో నిర్మించినవేనని గుర్తు చేశారు. సదస్సులో పాల్గొన్న ఏయూ హిస్టరీ విభాగం విశ్రాంత ఆచార్యుడు కె. సూర్యనారాయణ మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీ స్థాయిలో చరిత్రలో మార్పులు చేయలేదని అన్నారు. మొఘలులపై ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ, మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. భారతదేశం హిందూ దేశం కాదని, ఇక్కడ కోట్లాది మంది ముస్లింలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. చరిత్రలోని మంచి చెడులను యథాతథంగా పాఠ్యాంశాల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.