
విత్తన యాతన
ఖరీఫ్ రైతుల్లో విత్తన యాతననెలకొంది. జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విత్తన పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడకపోవడంతో దిగులు చెందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్‌లో ఇప్పటికే విత్తనాలు సరఫరా చేయగా కూటమి ప్రభుత్వంలో ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని గిరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి,పాడేరు: ఖరీఫ్ రైతులు ప్రభుత్వం ఏటా పంపిణీ చేసే విత్తనాలకోసం ఆశతో ఎదురుచూస్తున్నారు. మైదాన ప్రాంతంతో పోలిస్తే ఏజెన్సీలో రెండు నెలలు ముందుగానే ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. రైతులు ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. వీరి అవసరాలను గుర్తించిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే విత్తనాలు సరఫరా చేయడంతో గిరి రైతులు ఉత్సాహంగా ఖరీఫ్ పనులకు ఉపక్రమించేవారు. విత్తన పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో నారుమడుల తయారీకి సిద్ధపడలేకపోతున్నారు.
● ఖరీఫ్‌లో జిల్లాలో 56,792 ఎకరాల్లో గిరి రైతులు వరిని సాగు చేస్తుంటారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో గిరిజన రైతుకు ఏటా 90 శాతం రాయితీపై వరి విత్తనాలు పంపిణీ చేసింది. రైతులకు ఇబ్బంది లేకుండా ఫిబ్రవరిలోనే ఏపీ సీడ్స్ వద్ద కొనుగోలు చేసి మే నెల నాటికి పంపిణీ పూర్తి చేసేది. కూటమి ప్రభుత్వం విత్తన పంపిణీ ఊసెత్తకపోవడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు.
మార్చిలోనే నివేదిక
జిల్లా వ్యాప్తంగా 28వేల క్వింటాళ్ల వరి విత్తనాలు ఖరీఫ్‌కు అవసరమని మార్చి నెలలోనే వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అధికశాతం గిరిజన రైతాంగం ఏటా వ్యవసాయశాఖ రాయితీపై పంపిణీ చేసే విత్తనాలపైనే ఆధారపడుతుంటారు. అయితే విత్తనాల పంపిణీపై కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గిరిజన రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
● జిల్లావ్యాప్తంగా కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ముందస్తుగా ఖరీఫ్ వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం నారుమడులు సిద్ధం చేసుకునేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్న తరుణంలో ప్రభుత్వం ఇప్పటివరకు విత్తనాలు సరఫరా చేయకపోవడంతో రైతులను నిరాశకు గురి చేస్తోంది. 90 శాతం రాయితీపై పంపిణీ చేస్తుందా లేదా అనేదానిపై కూడా రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.