విద్యార్థులు లక్ష్యాలను సాధించాలి
పాడేరు : గిరిజన విద్యార్థులు తమ ప్రాథమిక విద్య దశ నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకొని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అన్నారు. పది ఫలితాల్లో సూపర్ ఫిప్టీ ద్వారా ప్రత్యేక శిక్షణ పొందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచారని ఆయన ప్రశంసించారు. గురువారం ఐటీడీఏ సమావేశ మందిరంలో సూపర్ ఫిప్టీ ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులతో విజయోత్సవ సభ నిర్వహించారు. సూపర్ ఫిప్టీ ద్వారా గిరిజన విద్యార్థుల ప్రగతికి గత ఐటీడీఏ పీవో అభిషేక్ బాటలు వేశారని, దాన్ని తాము కూడా కొనసాగిస్తామన్నారు. సూపర్ ఫిప్టీ విద్యార్థులకు ఐటీడీఏ అండగా ఉంటుందన్నారు. కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రవేశ పరీక్షలు రాసి సీట్లు సంపాదించుకోవాలన్నారు. బాలికలు తమ చదువులను పూర్తి చేసుకొని స్థిరపడేంత వరకు వివాహాలు చేసుకోవద్దని సూచించారు. సూపర్ పిప్టీ బ్యాచ్ విజయవంతం కావటానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, సూపర్ పిప్టీ ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులు, వారి కుటుంబ సభ్యులను ఆయన శాలువలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ వెంకటేశ్వరరావు, రజనీ, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


