
25 కిలోల గంజాయితో నలుగురి అరెస్టు
రోలుగుంట: గంజాయి వ్యాపారులపై స్థానిక ఎస్‌ఐ రామకృష్ణారావు కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆదేశాలతో సోమవారం దిబ్బలపాలెం గ్రామంలో దాడి చేశారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి, వారి నుంచి 25 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. వివరాలివి. మండలంలోని దిబ్బలపాలెం గ్రామానికి చెందిన చవ్వాకుల చిన్నమ్మలు ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చి నిల్వ చేసి ప్యాకెట్ల రూపంలో విక్రయాలు చేస్తోంది. ఇదే మండలం జె.నాయుడుపాలెం గ్రామానికి చెందిన వడ్డాది సాయి, బంగారు పవన్ అనే వ్యక్తుల సాయంతో మద్దె గరువు ప్రాంతం వెళ్లి పెదబయలు మండలం తగ్గుపాడు గ్రామానికి చెందిన కిలో తిమోతి వద్ద 25 కేజీల గంజాయి కొనుగోలు చేసి, మైదాన ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా నలుగురు వ్యక్తులను కొంతలం కూడలి వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్‌ఐ తెలిపారు. గంజాయితో పాటు వారు రవాణాకు వినియోగించిన రెండు ద్విచక్రవాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లు సీజ్ చేసినట్టు విలేకరులకు వివరించారు.
10 కిలోల గంజాయితో మైనర్ అరెస్టు
చీడికాడ: 10 కిలోల గంజాయితో ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ బి.సతీష్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ముందస్తు మేరకు మండలంలోని కోనాం పంచాయతీ గుడివాడ బ్రిడ్జి వద్ద తనిఖీలు నిర్వహించగా పెదబయలు మండలం గొమంగి పంచాయతీ చావిడిమామిడికి చెందిన మైనర్ బాలుడు స్కూటీపై 10 కిలోల గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డాడన్నారు. ఆ బాలుడిని విచారించగా తనకు రూ.5వేలు అవసరం కాగా స్కూటీ యజమాని అయిన పెదబయలుకు చెందిన వ్యక్తిని సంప్రదించడంతో గంజాయిని అనకాపల్లి వరకు తరలించి అప్పగిస్తే ఆ నగదు ఇస్తానని చెప్పాడన్నారు. పరారీలో ఉన్న ఆ వ్యక్తిని పట్టుకుంటామని ఎస్‌ఐ చెప్పారు.