ఉత్తర ద్వార దర్శనానికి వేళాయె
సింహాచలం: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తరద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ఉత్తర రాజగోపురంలో మంగళవారం ఉదయం 5.30 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వైకుంఠనారాయణుడిగా శ్రీదేవి, భూదేవి సమేతుడై దర్శనమివ్వనున్నాడు. సుమారు 50 వేల మంది భక్తులు ఈసారి స్వామి దర్శనానికి వస్తారని అంచనా వేశారు. ఉచిత దర్శనం క్యూతోపాటు రూ.100, రూ..300 దర్శన క్యూలు, రూ.500 ప్రత్యేక దర్శన క్యూ, ప్రోటోకాల్ వీఐపీల క్యూలు ఏర్పాటు చేశారు. ఉత్తరరాజగోపురం ఎదురుగా భక్తులు క్యూల్లో నడుస్తూనే 15 నిమిషాలపాటు స్వామిని దర్శించుకునే ఏర్పాటు చేశారు. అలాగే ఉత్తరద్వారం దర్శనం కాగానే నేరుగా ఆలయంలోకి వెళ్లి నీలాద్రిగుమ్మం నుంచి మూలవిరాట్ దర్శనం చేసుకునేలా క్యూలు రూపొందించారు. ఆలయ రాజగోపురం, ఉత్తర రాజగోపురం, ఆలయ ప్రాంగణాలకు విద్యుద్దీపకాంతులు చేకూర్చారు. భారీ ఎత్తున పుష్పాలంకరణ చేశారు. ఉదయం 4 గంటల నుంచి సింహగిరికి ఆర్టీసీ, దేవస్థానం బస్సులు ప్రారంభమవుతాయి. సుమారు లక్ష లడ్డూల ప్రసాదాన్ని విక్రయానికి సిద్ధం చేశారు. సింహగిరిపైన, కొండదిగువ కలిపి మొత్తం ఆరుచోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 190 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు విధులు నిర్వర్తిస్తారని గోపాలపట్నం సీఐ ఎల్.ఎస్.నాయుడు తెలిపారు.
నేటి నుంచి రాత్రి 7 గంటల వరకే దర్శనాలు
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనాలు మంగళవారం నుంచి జనవరి 9వ తేదీ వరకు రాత్రి 7 గంటల వరకు మాత్రమే లభిస్తాయని అధికారులు తెలిపారు. ఆలయంలో జరిగే రాపత్తు ఉత్సవాల సందర్భంగా ఈ మార్పు చేసినట్టు పేర్కొన్నారు.
దర్శన వివరాలు
ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకు ఉత్తరద్వార దర్శనాలు ముగిసినా.. మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు మూలవిరాట్ దర్శనాలు ఉంటాయి.
ఉత్తర ద్వార దర్శనానికి వేళాయె


