అందని సేవలు.. తప్పని తిప్పలు
● సంత రోజున వైద్య సేవలు కరువు
● రోగులకు అవస్థలు
పెదబయలు: మండలం కేంద్రంలోని 24 గంటల ప్రభుత్వ ఆస్పత్రిలో సంత రోజు ఓపీ చూడడానికి వైద్యులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. పెదబయలు పీహెచ్‌సీలో రోజూ ఓపి 100 మందిలోపు ఉంటుంది. అయితే ఇక్కడ సంత సోమవారం కావడంతో స్థానికులతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు వైద్య సేవల కోసం ఆస్పత్రికి వస్తుంటారు. ఈ కారణంగా సోమవారం ఓపీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ రోజు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సుదూరం నుంచి వచ్చిన రోగులు నానా అవస్థలు పడుతున్నారు. సోమవారం ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులు ఉన్నా డాక్టర్ సత్యశ్రీ సెలవు పెట్టడం, మరో వైద్యుడు డాక్టర్ నిఖిల్ కిలగాడ పీహెచ్‌సీకి వెళ్లడంతో ఆస్పత్రిలో ఓపిని కిందస్థాయి సిబ్బంది చూశారు. అలాగే డెలీవరికి సంబంధించి కూడా గర్భిణులు ఆస్పత్రిలో చేరారు. తప్పనిసరిగా ఒక వైద్యులు సెలవు పెడితే ఓపీ చూడడానికి మరో వైద్యులను ఉన్నతాధికారులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ దిశగా దృష్టి సారించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిస్థాయిలో ఇద్దరు వైద్యులు ఒకరూ ఆస్పత్రిలో సేవలందిస్తుంటే మరొకరు గ్రామాల్లో వైద్య శిబిరాల ద్వారా రోగులకు సేవలందించేవారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఓపి చూడడానికి ఎవ్వరు లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి రోజు ఓపీకి వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని, వారపు సంత రోజులో తప్పనిసరిగా వైద్యులు ఆస్పత్రిలో ఉండేలా చూడాలని కోరుతున్నారు. ఆస్పత్రికి ఇద్దరు వైద్యులను నియమించాలని కోరుతున్నారు. ఈ విషయంపై వైద్యాధికారి సత్యశ్రీని వివరణ కోరగా తనకు ఆరోగ్యం బాగాలేక సెలవు పెట్టడం జరిగిందని, కింద స్థాయి సిబ్బంది ఓపీ చూస్తున్నారని వెల్లడించారు.
అందని సేవలు.. తప్పని తిప్పలు


