సమీకృత సాగు రైతులకు మేలు
నర్సీపట్నం: సమీకృత సాగు విధానంతో రైతులు ఆర్థికంగా లాభపడవచ్చునని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కె.శచీదేవి పేర్కొన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో వ్యవసాయ, అనుబంధ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు సమీకృత వ్యవసాయ విధానంపై అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ సమీకృత వ్యవసాయ వ్యవసాయం ప్రధాన లక్ష్యం సాగు పశుపోషణ, చేపల ఉత్పత్తి, పౌల్ట్రీ తదితర ఉత్పాదకతను పెంచడమే కాకుండా వీటి వల్ల ప్రతి రోజు ఆదాయం సమకూరుతుందన్నారు. సమీకృత వ్యవసాయ విధానంలో విభిన్న రకాల పంటలను పండించడం, అనేక రకాల జంతువులను పెంచడం ద్వారా రైతులు ఏడాది పొడవునా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు అన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఒకటి లేదా రెండు పంటలను కోల్పోయినప్పటికీ మిగిలిన రకాల పంటలు పశుపోషణ, చేపల పెంపకం తదితర వాటి ద్వారా దాయం పొందడానికి వీలవుతుందన్నారు. కూరగాయలు పెంపకం, గేదెల పెంపకం, తేనె తీగల పెంపకం ద్వారా ఆదాయం సమకూరుతుందన్నారు. ఆయా అనుబంధ సంస్థల ద్వారా రాయితీలు కూడా రైతులు పొందవచ్చన్నారు. ఈ సమావేశంలో డీపీఎం ఎల్‌హెచ్.వరప్రసాద్, ఏసీ సత్యనారాయణ, ఏపీఎంఎఫ్‌పీఓ జగన్నాఽథం, గొలుగొండ, నాతవరం ఎపీఎం రమణ కుమారి తదితరులు పాల్గొన్నారు.


