చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
● చెరకు రైతుల బకాయిలు
వెంటనే చెల్లించాలి
● గోవాడ చక్కెర కర్మాగారం రైతులు, కార్మికుల మానవహారం
చోడవరం: వెంటనే చెరకు బకాయిలు చెల్లించాలని కోరుతూ రైతులు, కార్మికులు మెయిన్‌రోడ్డుపై మానవహారం చేశారు. ఇచ్చిన మాట తప్పిన చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 16 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో చివరికి రోడ్డెక్కారు. ముందుగా మెయిన్‌రోడ్డుపై మానవహారం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులను ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకన్నపాలెం–చోడవరం మెయిన్‌రోడ్డుపై ఈ ఆందోళన జరగడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అనంతరం ఫ్యాక్టరీ మెయిన్‌గేటు వద్ద ఏర్పాటు చేసిన రిలేదీక్ష శిబిరంలో రైతులు, కార్మికులు కూర్చొని నినాదాలు చేశారు. సీపీఐ, రైతు కూలీ సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ, ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు, ఏపీ చెరకు రైతు సంఘం, వ్యవసాయ కూలీ సంఘం, ఏపీ రైతు సంఘం నాయకులు నిరసన తెలిపారు. చెరకు రైతుల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. ఫ్యాక్టరీని పరిరక్షించడం చేతకాని చోడవరం ఎమ్మెలే వెంటనే రాజీనామా చేసి రైతులతో ఉద్యమానికి దిగాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఫ్యాక్టరీ క్రషింగ్ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీని మూసివేసే ఆలోచన చేస్తే రైతులు, కార్మికులు అంతా కలిసి ఐక్యంగా ప్రత్యక్ష ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికులకు జీతాలు లేక ఆకలిలో కుటుంబాలు పస్తులండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహనరావు, ఫ్యాక్టరీ పరిరక్షణ నాయకులు శానాపతి సత్యారావు, ఏడువాక శ్రీను, సుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాయి సూరిబాబు, శరగడం రామునాయుడు, రైతు సంఘం నాయకులు పడాల కొండలరావు, సోమిరెడ్డి నాయుడు, సీఐటీయూ నాయకుడు ఎస్వీ నాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు, నాగిరెడ్డి సత్యనారాయణ, ఆర్.దేముడునాయుడు, కాళ్ల సత్యనారాయణ, అప్పారావు, జి. రమణ, కె. శంకర్రావు, తదితరులు పాల్గొన్నారు.
చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి


