నేడు అప్పన్న తెప్పోత్సవం
సింహాచలం: పుష్యబహుళ అమావాస్యను పురస్కరించుకుని సింహాచల క్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి తెప్పోత్సవం ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరగనుంది. కొండ దిగువన ఉన్న వరాహ పుష్కరిణిలో శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు హంసాకార తెప్పపై నౌకా విహారం చేస్తూ భక్తులకు కనువిందు చేయనున్నారు. ఈ వేడుక అనంతరం రాత్రి వేళ స్వామివారు సర్వజన మనోరంజని వాహనాన్ని అధిష్టించి అడవివరం గ్రామంలో తిరువీధి ఉత్సవంలో పాల్గొంటారు. ఈ ఉత్సవం కోసం దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. శనివారం సాయంత్రం విశాఖ ఫిషింగ్ హార్బర్ ఫిషరీస్ డవలప్‌మెంట్ అధికారిణి ఆశాజ్యోతి ఆధ్వర్యంలో హంసాకార తెప్పకు విజయవంతంగా ట్రయల్‌రన్ నిర్వహించారు. తెప్ప సామర్థ్యాన్ని, భద్రతను పరిశీలించిన అనంతరం స్వామివారితో పాటు కేవలం 15 మందిని మాత్రమే తెప్పపైకి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఈవో ఎన్. సుజాత, ఇంజనీరింగ్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఉత్సవ నిర్వహణ కోసం వరాహ పుష్కరిణిని, హంస వాహనాన్ని పూలతోనూ, విద్యుత్ దీపకాంతులతోనూ సర్వాంగ సుందరంగా అలంకరించారు. పుష్కరిణి మధ్యలో ఉండే మండపాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దడంతో పాటు, గట్టుపై భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. భద్రతా పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 15 మంది గజ ఈతగాళ్లను, అదనపు బోట్లను, లైఫ్ జాకెట్లను అందుబాటులో ఉంచారు. గోపాలపట్నం పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.ఉత్సవ క్రమాన్ని పరిశీలిస్తే, ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి వేణుగోపాలస్వామి అలంకరణ చేసి, మెట్ల మార్గం గుండా కొండ దిగువకు తీసుకొస్తారు. సాయంత్రం 5 గంటలకు పుష్కరిణిలో హంస వాహనంపై స్వామివారిని వేంజేపు చేసి, మండపం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు నిర్వహిస్తారు. అనంతరం మండపంలో షోడషోపచార పూజలు పూర్తి చేసి, అక్కడి నుంచి పుష్కరిణి సత్రం వద్దకు చేరుస్తారు. చివరగా సర్వజన మనోరంజని వాహనంపై అడవివరం గ్రామంలో ఊరేగింపు నిర్వహించి, రాత్రికి స్వామివారిని తిరిగి సింహగిరికి చేరుస్తారు.
ముస్తాబవుతున్న తెప్ప
విజయవంతంగా ట్రయల్‌రన్
ముస్తాబైన వరాహ పుష్కరిణి
వేణుగోపాలస్వామి అలంకారంలో దర్శనమివ్వనున్న అప్పన్న
రాత్రి సర్వజనమనోరంజని
వాహనంపై గ్రామ తిరువీధి
విశేషంగా ఏర్పాట్లు


