ఎడ్లబళ్ల పోటీ విజేత లెక్కలవానిపాలెం
దేవరాపల్లి: మండలంలోని ఎన్.గజపతినగరంలో నారితల్లమ్మ పేరంటాలు తీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి ఎడ్ల పరుగు పోటీలు హోరాహోరీగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 12 ఎడ్ల బళ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. లెక్కలవానిపాలెంకు చెందిన పెదపైడితల్లమ్మ తల్లి ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. అర్జునగిరికి చెందిన పరవాడ నాయుడు ఎడ్లు ద్వితీయ స్థానం, నర్సయ్యపేటకు చెందిన ముమ్మిన రామకృష్ణ ఎడ్లు తృతీయ, లెక్కలవానిపాలెంకు చెందిన వెంకట కోమలి ఎడ్లు నాల్గువ, మామిడిపల్లి లెక్కల సత్యనారాయణ ఎడ్లు ఐదో, చుక్కపల్లి మజ్జి రాజేష్ ఎడ్లు ఆరవ, కేజే పురం కోలా మోహన్‌రావు ఎడ్లు ఏడో, చిరికి వెంకటరావు ఎడ్ల ఎనిమిదో స్థానంలోను నిలిచాయి. విజేతలుగా వరుసగా రూ. 20వేలు, రూ.15వేలు, రూ.12 వేలు, రూ.10 వేలు, రూ. 8వేలు, రూ. 6వేలు, రూ. 5 వేలు, రూ. 3వేలు చొప్పున నగదు బహుమతులను గ్రామ పెద్దలు చేతులు మీదుగా అందజేశారు. మధ్యాహ్నం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భారీ అన్నసమారాధన, రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారు జాము నుంచి నారితల్లమ్మ పేరంటాలను దర్శించుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.


