స్ట్రాబెర్రీల మాధుర్యం
పైనరీ అందం..
డుంబ్రిగుడ: ఎత్తయిన పైన్ వృక్షాలతో అలరించే అరకు పైనరీలో చేపట్టిన స్ట్రాబెర్రీ సాగు మొదటి ప్రయత్నంలోనే ఆశించిన ఫలితాలు ఇచ్చింది. పచ్చని చెట్ల మధ్య ఎర్రని స్ట్రాబెర్రీలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
● పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు ఆదాయ వనరులను పెంచుకోవాలనే లక్ష్యంతో అటవీ శాఖ రేంజర్ కోటేశ్వరరావు పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. సుమారు రూ.2 లక్షల వ్యయంతో పుణె నుంచి పది వేల మొక్కలను రప్పించారు. అర ఎకరా విస్తీర్ణంలో సాగు చేపట్టారు. గత రెండు నెలలుగా పడిన శ్రమకు ఫలితంగా ఇప్పుడు పండ్లు కోత దశకు వచ్చాయి.
పూర్తిగా సేంద్రియ సాగు
ఈ సాగులో నాణ్యత కోసం పక్కా ప్రణాళికను అనుసరించారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలకు నీరు అందిస్తున్నారు. ఆవు గెత్తం, వేపపిండితో తయారు చేసిన మట్టి దుబ్బలను సిద్ధం చేశారు. కలుపు నివారణకు మల్చింగ్ షీట్లు వాడారు. పురుగులు పట్టకుండా ఉండటానికి ప్రతిరోజూ ఆవు మూత్రం, వేప కషాయాన్ని పిచికారీ చేస్తూ పూర్తి సేంద్రియ పద్ధతిలో పంటను పండిస్తున్నామని అరకు పైనరీ మేనేజర్ ఎం.శేఖర్ తెలిపారు.
పర్యాటకులకు అందుబాటులో..
సినిమా షూటింగులు, ఫొటో షూట్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న అరకు పైనరీలో ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీల విక్రయం కూడా మొదలైంది. ఒక్కో బాక్స్ రూ.100కు విక్రయిస్తున్నారు. పర్యాటకులు నేరుగా పైనరీ/ అటవీ శాఖ అధికారులను సంప్రదించి వీటిని కొనుగోలు చేయవచ్చు.
అరకు పైనరీలో కొత్త అందాలు
పర్యాటకులను ఆకర్షిస్తున్న క్షేత్రం
సమకూరుతున్న ఆదాయం
అటవీశాఖ, వీఎస్‌ఎస్ సభ్యుల ప్రయత్నం విజయవంతం
స్ట్రాబెర్రీల మాధుర్యం


