భారీజం
పంట దిగుబడికి ప్రతిరూపం
గిరిజనుల ఆచార సంప్రదాయాలకు నిలువుటద్దం పట్టే ’భారీజం’ పండగ పాడేరుమండలం తామరాపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన శంకులమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. పంట దిగుబడులు ఆశాజనకంగా రావడంతో ప్రకృతికి కృతజ్ఞతగా జరుపుకునే ఈ ‘భారీ విజయం’ వేడుకలో ఏజెన్సీ ప్రాంత గిరిజనులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ థింసా నృత్యాలు, వాయిద్యాలతో గ్రామం కోలాహలంగా మారింది.
సాక్షి,పాడేరు: సంక్రాంతి పండగ సమయంలో మూడేళ్లకు ఓ సారి జరుపుకునే గిరిజనుల ఆచార సంప్రదాయ భారీజం పండగ శుక్రవారం వనుగుపల్లి పంచాయతీ తామరాపల్లిలో అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ చావిడిలో శంకులమ్మ తల్లికి ఉదయం నుంచి పూజలు చేశారు. మధ్యాహ్నం నుంచి పంట పొలాల్లో పండగ నిర్వహించారు. గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా గిరిజనులు పలు వేషధారణల్లో అలరించారు. వీటిని తిలకించేందుకు వనుగుపల్లి పంచాయతీతో పాటు ఏజెన్సీలోని పలు గ్రామాలకు చెందిన గిరిజనులు తరలివచ్చారు. గిరిజన యువతీ ,యువకులు, మహిళలు థింసా నృత్యాలతో సందడి చేశారు. గొలుసుకట్టుగా చేతులు పట్టుకుని ఆడే ఈ నృత్యం వారి మధ్య ఉన్న ఐక్యతను చాటిచెప్పింది. సంప్రదాయ వాయిద్యాలైన డప్పులు, తుడుము, సన్నాయి మేళాలతో సందడి నెలకొంది. ఊరేగింపుగా గ్రామచావిడి వద్దకు చేరుకున్న గ్రామదేవత శంకులమ్మ తల్లికి పూజలు చేశారు. నృత్యం చేస్తూ మయూరాలను తలపించారు.
భారీ విజయమే భారీజం
గిరిజనులు ప్రకృతిని, పూర్వీకులను ఆరాధించడం ఆనవాయితీ వస్తోంది. వ్యవసాయంతోనే వీరి జీవన విధానం ముడిపడి ఉంది. తిండిగింజల అవసరాలకు ఆహార ధాన్యాలు, పలు పప్పుజాతులు, నగదు అవసరాలకు వాణిజ్య పంటలను పూర్వం నుంచి సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో పంట దిగుబడులు ఆశాజనకంగా ఉంటే విజయంగా భావించి భారీవిజయం పేరిట ఒకరోజు పండగను సంక్రాంతి పండగ రోజుల్లో గిరిజనులు జరుపుకుంటారు.భారీ విజయం పండగ కాస్త కాలక్రమేణా భారీజం పండగగా పేరుమారింది.
పండగకు ఆర్థికసాయం
పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, గూడెంకొత్తవీధి జెడ్పీటీసీ శివరత్నం, స్థానిక ప్రజాప్రతినిధులు,పలు రాజకీయ పార్టీల నాయకులు, గిరిజన ఉద్యోగ,ఉపాధ్యాయులు భారీజం పండగ నిర్వహణకు తమవంతు ఆర్థికసాయం సాయం అందించారు.
పూర్వం నుంచి ఆనవాయితీ
ఖరీఫ్ సీజన్‌లో వరి, ఇతర పంటలన్ని బాగా పండిన తరువాత శంకులమ్మతల్లికి పూజలు జరుకుంటాం. సంక్రాంతి పండగ సమయంలో భారీజం పేరుతో పండగ నిర్వహించడం అనవాయితీ. గత 50 ఏళ్లుగా మూడేళ్లుగా ఈ పండగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం.
– పూజారి శ్రీనాధులు, గ్రామపెద్ద,
తామరాపల్లి, పాడేరు మండలం
తామరాపల్లిలో ఘనంగా పండగ
థింసా నృత్యం జోరు..
సంప్రదాయం హోరు
ముచ్చటగా శంకులమ్మ తల్లి చెంతన వేడుక
ఐక్యతకు, ఆచారానికి అద్దం
ప్రకృతి ఒడిలో పులకించిన గిరిజనం
భారీజం
భారీజం


