సంక్రాంతి వైభవం
మన్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా అంతటా గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా వేడుకలు మిన్నంటాయి. తెల్లవారుజాము నుంచే గిరిజనులు సంప్రదాయ దుస్తులు ధరించి, తమ ఆరాధ్య దైవాలకు పూజలు నిర్వహించి పండగను ఘనంగా ప్రారంభించారు. ఊరూరా థింసా నృత్యాలు, తుడుమ ప్రదర్శనలతో పచ్చని అడవి పండగ వెలుగులతో మెరిసిపోయింది. ప్రకృతి ఒడిలో మమేకమై జరుపుకున్న ఈ వేడుకలు గిరిజన సంస్కృతికి అద్దం పట్టాయి.
● వాడవాడలా ఘనంగా సంబరాలు
● ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
● పూర్వీకుల సమాధుల వద్ద పూజలు
● గోమాతకు ప్రత్యేక పూజలు
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండగను అన్నివర్గాలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పెద్దల సమాధులకు, గ్రామచావిడిలోని శంకులమ్మతల్లికి పూజలు చేశారు. కొత్త బియ్యంతో తయారుచేసిన పులగంను పశువులకు తినిపించారు. గోమాతలకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అలాగే గ్రామాల్లో డప్పు వాయిద్యాలు, థింసా నృత్యాలతో సందడి చేశారు. వంతాడపల్లి పంచాయతీ కోట్లగరువులో శుక్రవారం వైఎస్సార్‌సీపీనేత మాదెల కొండబాబు,సర్పంచ్ మాదెల రమణమ్మ దంపతుల ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించారు. విజేతలకు ఆదివారం జరిగే గొట్టి పండగలో బహుమతులు అందజేస్తామని వారు తెలిపారు.
కొయ్యూరు: స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గురువారం జనుమూరి కుటుంబీకులు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సూరేంద్రపాలెంకు చెందిన లావణ్య ప్రథమ, రాజేంద్రపాలెంకు చెందిన సాగరిక ద్వితీయ, సింగవరానికి చెందిన మామిడి దేవి, కాకరపాడుకు చెందిన పుష్ప తృతీయ బహుమతి సాధించారు. వీరికి జలుమూరి సోదరులు గిరిబాబు,గణబాబు, చంద్ర,నాగేశ్వరరావు, రామగోవింద్ బహుమతులు అందజేశారు. రేవళ్లులో సర్పంచ్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు.
జి.మాడుగుల: సంక్రాంతి సందర్భంగా పూర్వీకులు, కుటుంబసభ్యుల సమాధులను అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కనుమ పండగ నాడు నేస్తపు చుట్టాలు (వరుసకు అన్నదమ్ములు), బంధువులను (వరుసకు వియ్యంకులు, బావమరిదిలు) ‘జోరా’ అంటూ వంగి నమస్కరించుకుని ఆహ్వానించుకున్నారు. ఇంటికి వచ్చిన అతిథులకు కొత్త దుస్తులు అందజేశారు. గ్రామాల్లో సేరుబుడియాలు సందడి చేశారు.
చింతపల్లి: మండలంలోని చౌడుపల్లిలో మూడు రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంక్రాంతి, కనుమ నాడు రాములవారి భజన బృందం పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. థింసా, నేల డ్యాన్సులు, కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
గూడెంకొత్తవీధి: సంక్రాంతి పండగ గూడెంకొత్తవీధిలో ఘనంగా జరిగింది. యువత ఆటపాటలతో సందడి చేశారు.
సీలేరు: ఈ ప్రాంతంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతీ ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు ఆకట్టుకున్నాయి. గంగిరెద్దుల సందడి నెలకొంది. స్థానిక హొటళ్లు రద్దీగా కనిపించాయి. ఆర్టీసీ బస్సులకు తాకిడి నెలకొంది.
విజేతలకు బహుమతుల పంపిణీ
ముంచంగిపుట్టు: మండలంలోని గ్రామాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఏనుగురాయి పంచాయతీ బొడిపుట్టులో థింసా, డ్యాన్స్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. టెన్త్‌లో మంచి మార్కులు సాధించిన గ్రామానికి చెందిన కుసుమ కుమారిని గ్రామస్తులు సన్మానించారు. జోలాపుట్టు, సరియాపుట్టులో నిర్వహించిన సంక్రాతి వేడుకల్లో జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర దంపతులు పాల్గొన్నారు.
సంక్రాంతి వైభవం
సంక్రాంతి వైభవం
సంక్రాంతి వైభవం


